టీడీపీ సీనియర్లకు కోలికపూడి ఝలక్

-

రాజకీయాల్లో అవకాశం కోసం ఎదురు చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఆ అవకాశం కొద్దిమందికే వస్తుంది.. అలా వచ్చినా కూడా దానిని సద్వినియోగం చేసుకునే వారు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టుకునేంత మందే ఉంటారు. ప్రస్తుత ఎన్నికల్లో టికెట్‌ కోసం ఎంతో మంది తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారిలో కొందరికి మాత్రమే పార్టీలు అవకాశమిచ్చాయి. వారికే గెలుపు గుర్రాలు అనే పేరు కూడా పెట్టారు అధినేతలు. అయితే ఇలా టికెట్లు దక్కించుకున్న వారిలో కొందరు మాత్రం తామే హీరో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

మీతో నాకేంటి అంటూ కాలర్‌ ఎగిరేయడంతో… ఇప్పుడు మొదటికే మోసం వస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది టికెట్లు ఆశించారు. ప్రధానంగా తిరువూరు టికెట్ కోసం టీడీపీలో ఎంతోమంది సీనియర్లు ప్రయత్నించారు. అయితే అమరావతి ఉద్యమ నేతగా గుర్తింపు తెచ్చుకున్న కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్ధాపించిన నాటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్లను కొలికపూడి శ్రీనివాసరావు దూరం చేసుకుంటున్నారు.

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కడమే కాక తన గెలుపునకు కృషి చేసే క్యాడర్‌ను అనుమానంతో చూడటం పరిపాటైందని పలువురు భావిస్తున్నారు. ఇటీవల కొలికపూడి వద్దంటూ కొందరు నాయకులు, కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వద్దకు, పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు కూడా. ఇందుకు తెరవెనుక పాత్రధారులు ఉన్నారని అనుమానించి వారిలో సీనియర్ నేత తాళ్లూరి రామారావును కొలికపూడి టార్గెట్ చేశారు.

పార్టీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా అందరిముందు తాళ్లూరిని ఘోరంగా అవమానించి, వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడిన కొలికపూడి మరోసారి పార్టీ క్యాడర్‌ను ఖంగు తినిపించారు. మీ సేవలు పార్టీకి అవసరం లేదంటూ ఆయనను ఏకపక్షంగా బయటికి పంపేశారు. వాస్తవంగా ఏ నాయకుడి పనితీరైనా నచ్చక పోతే అధిష్టానానికి ఫిర్యాదు చేయడం పద్దతి. హైకమాండ్ తీసుకునే నిర్ణయం మేరకు అభ్యర్థి వ్యవహరిస్తారు. కానీ అన్నీ తానేనని, పార్టీకి తన మాటే వేదవాక్కని కొలికపూడి భావించడంతో పార్టీ కేడర్ భగ్గుమంటోంది. అందరి ముందు తీవ్ర అవమానం పాలైన తాళ్లూరి తన సామాజిక వర్గం నేతలతో, అభిమానులతో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

ఇదేవిధంగా గతంలో పార్టీ సీనియర్ నేత జయసింహను కూడా మీ సేవలు మాకు అవసయలేదంటూ ముఖం మీద చెప్పడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇప్పటికే సగం కేడర్ కొలికపూడి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండగా, ఇప్పుడు మిగిలిన వారు కూడా గుడ్ బై చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా తిరువూరు టీడీపీలోని ఒక వర్గం నాయకులకు కొలికపూడి కొరకరాని కొయ్యగా తయారయ్యారనేది అక్షర సత్యం. ఈ విషయం పై ఒక వర్గం టీడీపీ నేతల కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి మరి!?.

Read more RELATED
Recommended to you

Latest news