స‌త్య‌వేడుకి ఉపఎన్నిక అనివార్య‌మా.. రాజీనామా ఆలోచ‌న‌లో ఆదిమూలం

-

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం త్వ‌ర‌లో త‌న ప‌ద‌వికి రాజీనామా చేసే ఆలోచ‌న‌లో ఉన్నారా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. నియోజకవర్గంలోని పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది. ఊహించని విధంగా సత్యవేడుకు ఉప ఎన్నిక ముంచుకు రావ‌చ్చ‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కేసులో ఇరుక్కున్నారు.

ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆయ‌న్ను ఇరికించారా అనేది అటుంచితే- తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఆదిమూలం మీద అత్యాచారం కేసు నమోదైంది. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లోని రూమ్ నంబర్లు 105, 106ల్లో ఆదిమూలం తనను శారీరకంగా హింసిస్తూ అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిమూలం రాసలీలలు నిర్వహించిన హోటల్ తాలూకు సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది.

మొన్న‌టి ఎన్నిక‌ల వేళ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వ‌చ్చారు ఆదిమూలం.తెలుగుదేశం మహిళా కార్యకర్త విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ సీక్రెట్ కెమెరాలకు దొరికిపోయి తన బతుకును రచ్చ చేసుకున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది.దీనిపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ఇంత రచ్చ అయిన నేపథ్యంలో ఆదిమూలం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు స‌మాచారం.

ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేస్తే మాత్రం ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమే. రాజీనామా త‌రువాత ఆదిమూలం మళ్ళీ వైసీపీ గూటికి వెళ్ళి పోటీ చేసినా గెలిచే అవకాశాలు త‌క్కువే.ఉప ఎన్నిక‌ల త‌ప్ప‌దంటే ఇప్పుడు టీడీపీ కూడా అభ్య‌ర్ధిని వెతుక్కోవ‌ల‌సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.మొన్నటి ఎన్నికల సందర్భంగా స్థానిక నేత జె.డి.రాజశేఖర్‌కి టీడీపీ టిక్కెట్ దక్కాల్సి ఉండ‌గా అప్పుడే పార్టీలోకి వ‌చ్చిన ఆదిమూలంకి కేటాయించారు.అయితే క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి, ఆదిమూలం గెలుపుకు తనవంతు కృషి చేశారు రాజ‌శేఖ‌ర్‌.

ఆదిమూలం రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే జె.డి.రాజశేఖర్‌కే టిక్కెట్ దక్కే అవకాశం ఉంది.అయితే రాజ‌కీయ ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు.రాజ‌శేఖ‌ర్‌కి బ‌దులు రేసులో ఎవ‌రు ముందుకొచ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చు.ఇక స‌త్య‌వేడులో ఉప ఎన్నిక వ‌స్తే వైసీపీ వ్యూహం ఎలా ఉండ‌బోతోంది అనేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆదిమూలం వైసీపీకి తిరిగి వ‌చ్చేస్తే ఆయ‌న‌కే టిక్కెట్ ఇస్తారా లేక మొన్న‌టి ఎన్ని్ల్లో పోటీ చేసిన రాజేష్‌కి రిజ‌ర్వ్ చేస్తారా అనేది అనుమానంగా ఉంది.

మొన్నటి ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన వైసీపీ, సత్యవేడుకు కనుక ఉప ఎన్నిక వస్తే ఈ స్థానాన్ని సొంతం చేసుకోవ‌డానికి విశాఖ త‌ర‌హాలో ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌క త‌ప్ప‌దు.అధికారంలో ఉన్న టీడీపీని దెబ్బ‌కు దెబ్బ కొట్టాలంటే వైసీపీ కూడా క్లీన్‌చిట్ ఉన్న అభ్య‌ర్ధిని నిల‌బెట్టి గెలిపించుకోవాలి.అలా అయినా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని పెంచుకోగ‌లుగుతుంది.ఇదంతా జ‌ర‌గాలంటే ఆదిమూలం రాజీనామా చేయాలి.కేసు విచార‌ణ‌లో ఉన్న నేప‌థ్యంలో ఏమి జ‌రుగుతుందోన‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news