తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత వేడెక్కుతోంది. సమయం ఆసన్నమవుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు పోరుకు సిద్దమవుతున్నాయి. అన్నీ పార్టీల కంటే ముందే అధికార బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను ప్రకటించేసింది. కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్ధుల జాబితాను సిద్ధం చేస్తోంది. ఇక లెఫ్ట్ పార్టీలు కూడా తమకు బలమున్న స్థానాల్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తొలుత బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని భావించినా, సీఎం కేసీఆర్ అనూహ్యంగా హ్యాండ్ ఇవ్వడంతో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ వైపు యూటర్న్ తీసుకున్నాయి.
వామపక్షాలకు బీజేపీతో పొత్తు పొసగదు కాబట్టి తెలంగాణలో ఉన్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. గతంలో అవసరమైన సందర్భాల్లో లెప్ట్ పార్టీలు కాంగ్రెస్ తో జత కట్టాయి. ఇప్పటికే ఒకట్రెండు సార్లు కాంగ్రెస్ నాయకులతో చర్చలు సాగించాయి. ముఖ్యంగా వామపక్షాలకు ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో స్థాన బలముంది. అక్కడ బరిలోకి అభ్యర్ధులను దించాలని భావిస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు చేస్తున్న సీపీఐ, సీపీఎం నేతలు వచ్చే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు.
ప్రధానంగా సీపీఐ ఖమ్మంలో కొత్తగూడెం, వైరా, నల్గొండలో మునుగోడు, ఆదిలాబాద్‌లో బెల్లంపల్లి, కరీంనగర్ లో హున్సాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీతో చర్చలు సాగిస్తోంది. అయితే ఖమ్మం జిల్లాలో రెండు సీట్లు కేటాయించాలేమని కాంగ్రెస్ చెబుతోంది. అయినా కొత్తగూడెం, హుస్నాబాద్ లపై సీపీఐ గట్టి పట్టుపడుతోంది. ఈ నేపధ్యంలో సీట్ల సర్దుబాట్లపై సీపీఐ తీవ్రంగా చర్చ జరుపుతోంది.
సీపీఐ విజ్ఞప్తిని కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందా ? లేదా? అని సందిగ్ధత నెలకొంది. రేపటి కల్లా ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. ఇక సీపీఎం మధిర, పాలేరు, ఇబ్రహీంపట్నం, మిర్యాలగూడ, భద్రాచలం నియోజకవర్గాలపై పట్టు బడుతోంది. ఈ సీట్లు ఇస్తే పొత్తుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ సీపీఎం అడిగే ఆ ఐదు సీట్లలో ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్ధులు ఉండడమే కారణం. మరి సీపీఎం డిమాండ్ పై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.