ఓడలు బండ్లు కావడం…అనే సామెతను తరచుగా మనం వింటూనే ఉంటాం.ఇప్పుడు ఈ సామెత కాంగ్రెస్ పార్టీకి అతికినట్టు సరిపోతుంది.ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోయిన జాతీయ పార్టీ అది.దేశంలోని దాదాపు 90 శాతం రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగిన ఘనత ఆ పార్టీది.పదులసంఖ్యలో ముఖ్యమంత్రులు.. అదే సంఖ్యలో గవర్నర్లు.. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కాంగ్రెస్ నాయకుడు అనే ట్యాగ్ లైన్‌తో పాటు మెడలో కండువాతో గర్వంగా కనిపించే వారు ఆ పార్టీ నాయకులు. మొన్నటి వరకు ఏకచక్రాధిపత్యం సాగించిన ఆ పార్టీ నేడు ఉనికి కోసం నానా తంటాలు పడుతోంది.కేవలం కొద్ది రాష్ర్టాల్లోనే అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు క్రమక్రమంగా అధికారానికి దూరమవుతూ వస్తోంది. ముఖ్యంగా ఏపీలో పూర్తిగా తెరమరుగైన ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం ఆరాటపడుతోంది.ఆంధ్రప్రదేశ్ ను తమ రాజకీయ ప్రయోజనాలకోసం విడగొట్టిన కాంగ్రెస్‌ను సీమాంధ్ర ప్రజలు ఎప్పుడో దూరం పెట్టేశారు. ఇకపైన కోలుకునే అవకాశం లేకుండా చేసేశారు. సీమాంధ్రులు పెట్టిన శాపం ప్రభావమేమోకానీ దేశ వ్యాప్తంగా ఆ పార్టీ చీకటి రోజులను ఎదుర్కొంటోంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎగిరెగిరిపడిన నాయకులంతా 2014,2019 ఎన్నికల్లో మట్టికరిచారు.దీనికితోడు దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత అయన కుటుంబాన్ని, ముఖ్యంగా కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కశ వైఖరిని అంగీకరించని ప్రజలు ఆ పార్టీని నేలమట్టం చేసేశారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆంధ్రాలో ఎక్కడా ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పేరు తలచుకోవడానికి సైతం కార్యకర్తలు ఇష్టపడడం లేదు. అయినా సరే 2014, 2019 ఎన్నికల్లో కొందరు నాయకులు కేంద్ర మంత్రులుగా చేసినవాళ్లు సైతం పట్టుమని పదివేల ఓట్లు సాధించలేక కుదేలైపోయారు.ఎన్నికల్లో కనీసం నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఆ పార్టీ అభ్యర్ధులు తెచ్చుకోలేకపోయారు. దీంతో కాంగ్రెస్ అవసాన దశలో ఉందన్న విషయాన్నీ ఎలుగెత్తి చాటుకుంది.
కాంగ్రెస్ హయాంలో ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా పని చేసిన పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే 8,640 ఓట్లు వచ్చాయి. ఇంకో కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9585 ఓట్లు వచ్చాయి . ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1384 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 2340 ఓట్లు రావడం ఆశ్చర్యకరం. ఇలా చెప్పుకుంటూ పొతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు కనీస మర్యాద దక్కలేదు. ఇకముందూ దక్కదు కూడా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వచ్చినా కూడా ఆంధ్రలో కాంగ్రెస్ కి అస్తిత్వం లేదు, ఇప్పుడు ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రాలో నూకలు దొరకవు.దీని గురించి అసలు చర్చే అవసరం లేదని కొందరు అంటున్నారు.అయితే కర్నాటక,తెలంగాణలో తెచ్చిన విజయాలతో ఏపీలో కూడా ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా తెరముందుకొచ్చారు.ఇతర పార్టీల్లోని అసంతృప్తులు కాంగ్రెస్‌కి క్యూకడుతున్నారని చెప్పిన పీసీసీ చీఫ్ రుద్రరాజు కాస్త హడావుడి చేసినా కనీసం కేడర్ కూడా పట్టించుకోలేదు. షర్మిల వంటి వ్యక్తులు ఆ పార్టీలోకి వచ్చినా సీమాంధ్రుల నుంచి స్పందన వస్తుందనుకోవడం పొరపాటే అవుతుంది.