నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆడుతున్న పొలిటికల్ గేమ్‌తో వైసీపీలో వణుకు మొదలైంది. ఒక్కసారిగా టీడీపీ అగ్రనేతలందరూ ఎమ్మెల్యే ఆనం నివాసానికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. నెల్లూరులో యువగళం జయప్రదం చేయడానికి ఆనం కేంద్రంగా చర్చలు జరిపారు. వైసీపీలో అవమానాలు భరిస్తూ నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆనం తన మార్కు రాజకీయానికి తెరలేపారా అనే అనిపిస్తోంది ప్రస్తుతం నెల్లూరులో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే.
ఇంతకాలం వైసీపీకీ దూరంగా సైలెంట్‌గా ఉన్న ఎమ్మెల్యే ఆనం నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర బాధ్యతను తన భుజానికెత్తుకున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో ఎవరెవరు చేరబోతున్నారు అనే డిస్కషన్‌లు ఊపందుకున్నాయి. తెలుగుదశం పార్టీకి నెల్లూరులో ఇప్పటికిప్పుడు ఇంత జోష్ ఎలా వచ్చిందన్నదే అందరిలో మెదులుతున్న ప్రశ్న.దీనికి కౌంటర్ ఇచ్చేందుకు కూడా వైసీపీ నేతలు సాహసించడం లేదు. ఆనం బరిలోకి దిగాక ఇప్పటివరకు ఒక లెక్క… ఇప్పటినుంచి మరో లెక్క అన్నట్టుగా మారాయి ఇక్కడి పరిస్థితులు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాలపై ప్రభావం చూపగల సమర్ధత ఎమ్మెల్యే ఆనంకు ఉంది. కాస్త అవకాశం వస్తే టీడీపీపై విరుచుకుపడే మంత్రి గోవర్ధన్‌రెడ్డి,ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి సైలెంట్ అయ్యారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,అటు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మీడియా ముందుకు రావడానికి వెనుకాడుతున్నారు. పార్టీ పెద్దలే సైలెంట్‌గా ఉంటే మనకెందుకులే అని జూనియర్‌లు కూడా సైడైపోతున్నారు. ఇదంతా చూస్తుంటే నెల్లూరు జిల్లాలో టీడీపీ పుంజుకుందా అనే చర్చలు అన్నిచోట్లా వినిపిస్తున్నాయి. వైసీపీలోనూ ఇదే విషయంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది.
ఆనంపై బహిరంగ విమర్శలు చేస్తే భవిష్యత్తులో రాజకీయ ముప్పు ఉంటుందని అధికార పార్టీ నాయకులు గ్రహించినట్లు సమాచారం. ఎందుకంటే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆనం అనుచరులు ఉన్నారు. అది కూడా చోటా మోటాగా కాదు.ఓ రేంజ్ కలిగిన నాయకులే ఆనం అనుచరులుగా ఉన్నారు. ఆనం కనుసైగ చేస్తే చాలు ఎంతటి బలమున్న వ్యక్తినైనా పార్టీతో సంబంధం లేకుండా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టగల సమర్ధత వారికుంది. ఈ నేపథ్యంలో ఆనంపై విమర్శలు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన కష్టం వైసీపీ నేతలకొచ్చింది.
ఆనం పేరు వింటేనే విరుచుకుపడే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు. తన అనుచరుడిగా కీలక నేతగా వ్యవహరించిన రూప్‌కుమార్ యాదవ్ వేరు కుంపటి పెట్టాక ఎమ్మెల్యే అనిల్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో తన ఇంటినే చక్కబెట్టుకోలేని వ్యక్తి ఆనంపై విమర్శలు చేస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఈ వాస్తవాన్ని గ్రహించారు కాబట్టే కొందరు ఎమ్మెల్యేలు ఆనంపై విమర్శలు చేసే సాహసం కూడా చేయలేదు.ఏది ఏమైనా వైసీపీ కంచుకోటగా ఉన్ననెల్లూరు జిల్లాలో మునుపటిలాగా జెండా రెపరెపలాడాలంటే తెలుగుదేశం పార్టీని వైసీపీ నేతలు బలంగా ఎదుర్కోవాలి. లేదంటే అధికార పార్టీకి నెల్లూరు జిల్లాలో కష్టమే మరి.