ప్రొటోకాల్ పాటించలేదని అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే బోండా ఉమా
విజయవాడ: దుర్గగుడిలో తాజాగా మరో వివాదం చోటుచేసుకుంది. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. తితిదే తరపున అసిస్టెంట్ ఈవో సాయిలు అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. దుర్గగుడి అధికారులు ఆయనకు సంప్రదాయ స్వాగతం పలికి సారె సమర్పణ కార్యక్రమం జరిపించారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే, తితిదే బోర్డు సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు.. తనను అధికారులు పట్టించుకోలేదని అలిగి మధ్యలోనే వెళ్లిపోయారు. వాస్తవానికి అమ్మవారికి అసిస్టెంట్ ఈవో ద్వారా సారె పంపిస్తున్నట్లు తితిదే నుంచి దుర్గగుడి ఈవోకు సమాచారం వచ్చింది. అలాగే బోర్డు సభ్యులు బోండా ఉమ కూడా కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారమిచ్చారు. అయితే సారె సమర్పణ అనంతరం వేద ఆశీర్వచన సమయంలో బోండా ఉమ అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. అధికారుల తీరు వల్లే ఎమ్మెల్యే వెళ్లిపోయారని దుర్గగుడి పాలకమండలి సభ్యుడు ధర్మారావు వ్యాఖ్యానించారు. దీనిపై ఈవో వివరణ ఇస్తూ తితిదే నుంచి వచ్చిన సమాచారం మేరకు అసిస్టెంట్ ఈవో ద్వారా తాము సారె స్వీకరించామని… ఎమ్మెల్యే ద్వారా పట్టువస్త్రాలు తీసుకోమని ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు.