మ‌రోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే చింత‌మ‌నేని

-

టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు. తాను నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలపై దాడులు చేసిన విజిలెన్స్‌ అధికారులపై చింతమనేని దౌర్జన్యానికి దిగారు. దీంతో ఈ ఘటనపై విజిలెన్స్‌ అధికారులు పెదవేగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చింతమనేని తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, తమను భయభ్రాంతులకు గురిచేశారని వెజిలెన్స్‌ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సోమవారం రాత్రి పెదవేగి మండలం కొప్పాక వద్ద సాగుతున్న అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి.. నాలుగు టిప్పర్లు, ప్రొక్లైనర్ ను‌ స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం ఈ మేరకు దాడులు చేసింది. విషయం తెలిసిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న చింతమనేని విజిలెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా టిప్పర్లనే సీజ్ చేస్తారా? మా వాళ్లపైనే కేసులా?’ అంటూ ఆయన దౌర్జన్యానికి దిగారు. సీజ్ చేసిన వాహనాలు వదలాలంటూ అధికారులను బెదిరించారు. అయినా వాహనాలను వదలకపోవడంతో ఎమ్మెల్యే చింతమనేని వెనుదిరగగా.. ఆయన ప్రోద్బలంతో కొద్దిసేపటికి చింతమనేని సోదరుడు, దుగ్గిరాల మాజీ సర్పంచ్ చింతమనేని సతీష్ ఆధ్వర్యంలో వందమంది టీడీపీ కార్యకర్తలు విజిలెన్స్ అధికారులను చుట్టుముట్టారు. విజిలెన్స్ బృందాన్ని భయభ్రాంతులకు గురిచేసి.. సీజ్ చేసిన నాలుగు వాహనాలను తీసుకెళ్లిపోయారు. జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు విజిలెన్స్ డీజీ దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్లారు.

మీడియాపైనా రౌడీయిజం!

ఈ ఘటన నేపథ్యంలో విజిలెన్స్ కార్యాలయంలో ఎస్పీ అచ్యుతరావుని కలిసిన చింతమనేని‌ ప్రభాకర్ .. అనంతరం మీడియాతోను దురుసుగా ప్రవర్తించారు. వివరణ కోరేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపైకి దూసుకెళుతూ.. చింతమనేని బూతుపురాణం విపారు. ‘మీ అంతు తేలుస్తా.. తొక్కిపెట్టి నారతీస్తా నా కోడక్కల్లారా’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో కెమారామెన్లు, మీడియా ప్రతినిధులు బిత్తరపోయారు. కాగా, అక్రమ మైనింగ్‌ చేస్తున్న నాలుగు టిప్పర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. వాటిని ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని, ఈ ఘటనపై పెదవేగి పోలీసులకి ఫిర్యాదు చేశామని విజిలెన్స్ ఎస్పీ అచ్యుతరావు మీడియాతో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news