నాకు ప్రాణ‌హాని ఉంది.. నన్ను కాపాడండి

-

*జ‌గ‌న్‌పై దాడికేసులో నిందితుడు శ్రీ‌నివాస్‌
* విశాఖ‌లో హైడ్రామా

అమ‌రావతి: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తనకు ప్రాణహాణీ ఉందని, తనను ఒక్కసారి ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలని శ్రీనివాసరావు కోరాడు. పోలీసు కస్టడీలో ఉన్న శ్రీనివాసరావు.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అధికారులు అతన్ని జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స అనంతరం తిరిగి అతన్ని కస్టడీకి తరలిస్తుండగా… తనకు ప్రాణహాణి ఉందని, ఒక్కసారి ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలని శ్రీనివాసరావు వేడుకున్నాడు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి దేవుడ‌ని, జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర కావాల‌నే అలా చేశాన‌ని, దాడి వెనుక ఎవ‌రూ లేర‌ని, పోలీసులు చంపేస్తున్నార‌ని శ్రీ‌నివాస్ ఏడుస్తూ చెప్పారు.

వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. మూడో రోజు విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌లో విచారిస్తున్న సందర్భంలో చేతులు, ఛాతిలో నొప్పి ఉన్నట్టు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తొలుత స్థానిక వైద్యుడు దేవుడుబాబుతో వైద్య పరీక్షలు చేయించారు. బీపీ, షుగర్‌ సాధారణ స్థితిలోనే ఉన్నాయని, చాతిలో నొప్పి, చేతులు తిమ్మిరిగా ఉన్న నేపథ్యంలో కేజీహెచ్‌లో నిపుణులతో వైద్యం చేయిస్తే మంచిదని, మెరుగైన వైద్యం కోసం శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించాలని వైద్యుడు దేవుడుబాబు పోలీసులకు సూచించారు. దీంతో విచారణ బృందం హుటాహుటిన నిందితుడిని కేజీహెచ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే, తనకు వైద్య సహాయం వద్దని, తన అవయవాలు తీసుకుపోండంటూ శ్రీనివాసరావు కోరుతున్నాడని డాక్ట‌ర్ దేవుడుబాబు తెలిపారు.

నవంబర్‌ 2వరకు నిందితుడిని విచారించేందుకు న్యాయస్థానం పోలీస్‌ కస్టడీకి అప్పగించింది. దీంతో ఇంకా కొన్ని రోజుల్లోనే విచారణ ముగియనుంది. అనంతరం కస్టడీ నుంచి తిరిగి కేంద్ర కారాగారానికి తరలించే సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈ విధంగా శ్రీనివాసరావుకు వైద్యసాయం అందించాల్సి రావడంతో పోలీసులు కొంత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. కేజీహెచ్‌ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మిగతా వారి విచారణ కొనసాగుతోంది. క్యాంటీన్‌లో శ్రీనివాసరావుతో పాటు పనిచేసే సహచరులను విచారిస్తున్నారు. కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news