మల్లన్నా…. జై చంద్రన్నా

-

జీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారా..అంటే అవుననే టాక్ నడుస్తోంది తెలంగాణ రాజకీయాల్లో.స్వతహాగా వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేతగా బాగా ఫేమస్ అయ్యారు. 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ బ్రాండ్‌గా అందరికీ గుర్తిండిపోయారు. 2014లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు.గత ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా, బీఆర్ఎస్ ఓడిపోవడంతో మల్లారెడ్డికి కష్టాలు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నా మల్లారెడ్డికి మాత్రం బ్రేకులు పడుతున్నాయి.దీంతో సరికొత్త ఆలోచనలో ముందుకెళ్లాలని చూస్తున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మల్లారెడ్డి ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్‌గా మారడంతో మల్లారెడ్డి బీజేపీలో చేరాలని ఆ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని బీజేపీ చెప్పడంతో అవసరమైతే మళ్ళీ పోటీ చేసి గెలుస్తానని కూడా చెప్పారట.కానీ, మల్లారెడ్డిని బీజేపీలో చేర్చుకునే విషయంలో సానుకూల స్పందన లేకపోవడంతో మరింత ఇబ్బందులు పెరిగిపోయాయి.ప్రస్తుతం మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఈ ఇద్దరూ తొలుత కాంగ్రెస్‌లోకి వెళ్లాలని భావించారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనే విభేదాలు ఉండటంతో ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.ఇదే సమయంలో మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం పూనుకోవడం,కేసులు నమోదు కావడం,తన నియోజకవర్గంలోని కౌన్సిలర్లు,కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ తనను ఒంటరిని చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచనను విరమించుకున్నారు.

ఇలా రెండు పార్టీల నుంచి రెడ్ సిగ్నల్ పడటంతో ఇప్పుడు ఒక గమ్మత్తు ప్లాన్ వేశారు మల్లారెడ్డి.పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించిన టీడీపీలో చేరితే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు.తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా, తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరడం మంచిదని భావిస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కు లేకపోవడం కూడా తనకు కలిసివస్తుందని అనుకుంటున్నారు.తనతోపాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకువెళ్లి.. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా చక్రం తిప్పాలని డిసైడ్ అయ్యారు మల్లన్న.ప్రస్తుతం ఏపీలో బీజేపీ,టీడీపీ మధ్య పొత్తు ఉండటం, కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడంతో తాను టీడీపీలో ఉంటే తనకు ఇండైరెక్ట్‌గా బీజేపీ మద్దతు ఉంటుందని భావిస్తున్నారు ఈ మాజీమంత్రి.

టీడీపీలో చేరడం వలన మరో లాభం కూడా ఉంది మల్లారెడ్డికి. సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సత్సంబంధాలు ఉండటం వలన తెలంగాణ ప్రభుత్వం తన వైపు చూసే అవకాశమే ఉండదని భావిస్తున్నారు. తెలంగాణలోనూ తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్న టీడీపీకి మల్లారెడ్డి వంటివారు చేరతామంటే కాదననే ధీమాలో ఉన్నారు. దీంతో తన మదిలోని ఆలోచనను సన్నిహితులతో పంచుకున్నారట మల్లన్న. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తన ప్రతిపాదనను తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారని సమాచారం. టీడీపీలో చేరితే నాలుగున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లోనూ బీజేపీతో అలయెన్స్‌ వలన రాజకీయంగా చక్రం తిప్పవచ్చనే అంచనాకు వచ్చారు. టీడీపీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి మళ్లీ టీడీపీ గూటికే వెళతారనే ప్రచారం ఇప్పుడు తెలంగాణలో హాట్‌టాపిక్‌ అయిపోయింది. మొత్తానికి మాస్ మల్లన్న పొలిటికల్ యాక్షన్‌ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news