ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయ్యిందో లేదో ? అప్పుడే ఎక్కడికక్కడ ? సొంత పార్టీ నేతల మధ్యే గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఒకరికి ఒకరంటే పొసగడం లేదు. కొన్ని చోట్ల కొత్త నేతలు వర్సెస్ పాత నేతల మధ్య పొసగని పరిస్థితి. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం అయిన చిలకలూరిపేటలో సైతం ఇప్పుడు లేడీ ఎమ్మెల్యే విడదల రజనీ వర్సెస్ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ వర్గాల మధ్య పొసగని పరిస్థితి.
ఎన్నికలకు ముందే రజనీ టీడీపీ నుంచి వచ్చి రాజశేఖర్‌ను కాదని మరీ సీటు దక్కించుకుంది. అప్పటి వరకు మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు వైపే ఉన్న ఆమె వైసీపీలోకి వచ్చి పుల్లారావును సవాల్ చేసి మరీ ఓడించింది. ఇక ఎన్నికల తర్వాత కూడా నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా రాజ్యమేలుతోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర కలకలం రేపుతున్నాయి.
రజనీ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ‘చిలకలూరిపేటకు పట్టిన పీడను వదిలించాలని, పేటకోటపై వాలిన అవినీతి గద్దలను తరిమివేయాలని జగనన్న స్థాపించిన వైసీపీలో చేరి పోటీచేశా.. ఎన్నో దుష్టశక్తులు నా కలలను చిదిమివేయాలని చూశాయి.. నా పోరాటాన్ని ఆపేయాలని పన్నాగాలు పన్నినా.. నిజాయితీవుంటే విజయం సాధిస్తామని మొన్నటి ఎన్నికలు నిరూపించాయి’ అని రజిని అన్నారు.
ఈ క్రమంలోనే అపోజిషన్‌లో ఉన్న మాజీ మంత్రితో తాను ఎందాకైనా పోరాటం చేస్తానని.. అయితే ఓ మహిళగా తాను సొంత పార్టీకి చెందిన నేతలతోనే యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. నా వెంటే ఉండి వెన్నుపోటు పొడవాలని చూసేవారి అంతుచూస్తా, ఇది నా నైజం అని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. రజనీ చేసిన ఈ వ్యాఖ్యలు సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌తో పాటు నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులను ఉద్దేశించే అన్న చర్చలు నడుస్తున్నాయి.
ఎంపీ లావు సీనియర్ నేతగా మర్రికి కూడా ప్రయార్టీ ఇస్తుండడం రజనీకి నచ్చలేదని తెలుస్తోంది. తాను స్థానిక ఎమ్మెల్యేగా ఉండడంతో తన మాటే నెగ్గాలంటోన్న రజనీ ఇప్పుడు సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదం భవిష్యత్తులో ఎలా ? ఎటు మలుపులు తిరుగుతుందో ? చూడాలి.