ముప్పును బట్టి ముఖ్యమంత్రి, మంత్రులకు భద్రతను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం కేటాయిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాన్వాయ్‌ని భద్రతకు అనుగుణంగా పోలీసులు ఎప్పుడూ గోప్యంగా ఉంచుతారని, కావలసినపుడు తీసుకొచ్చి కాన్వాయ్‌ని ఉపయోగిస్తారు. భద్రత విషయంలో రాజకీయ నాయకుల జోక్యం ఉండదని తెలిపారు.
గత పది సంవత్సరాలలో తనకు ఇంత భద్రత, అంత భద్రత ఉండాలని కేసీఆర్ కోరలేదని, పోలీసులే తగిన సెక్యూరిటీ కల్పించారని కవిత ప్రస్తావించారు.దాన్ని పెద్ద అంశంగా చేసి సీఎం రేవంత్ రెడ్డి వాహనాలను విజయవాడలో దాచిపెట్టారని వెటకారంగా మాట్లాడడం ఆయన గౌరవాన్నే తగ్గిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ తన వైఖరిని ఇప్పటికే వెల్లడించిందన్నారు. దర్యాప్తు నివేదిక రాకముందే ప్రభుత్వం ఇలా చేయటం సరికాదన్నారు. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయొద్దని పార్టీ ఒక నిర్ణయం తీసుకుందన్నారు.సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేసింది.