బీజేపీతో మోత్కుపల్లి ‘గ‌వ‌ర్న‌ర్’ ఆశ‌లు మ‌ళ్లీ చిగురించాయా…!

1655

మోత్కుపల్లి నరసింహులు ఒకప్పుడు తెలంగాణ టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేత… కానీ ఇప్పుడు పాలిటిక్స్ లో అడ్రెస్ లేని నేతగా అయిపోతున్నారు. 2018 ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా, అధినేత చంద్రబాబుకి సన్నిహితుడుగా ఉన్న మోత్కుపల్లి ఆ తర్వాత పార్టీ నుండి సస్పెండ్ అయ్యి ఒంటరిగా మిగిలిపోయారు. టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేసేయాలని మాట్లాడటంతో అధిష్టానం మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరించింది.

అక్కడ నుంచి ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ పార్టీలో చేరకుండా ఉన్న మోత్కుపల్లి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకి వ్యతిరేకంగా వైసీపీకి సపోర్ట్ చేశారు. ఆయన ఓడిపోవాలని తిరుపతి వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. దానికి తగ్గట్టుగా చంద్రబాబు ఓడిపోవడం, మోత్కుపల్లి మొక్కు తీర్చుకోవడం జరిగిపోయాయి.

ఇక ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయిన మోత్కుపల్లి పేరు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఆయన బీజేపీలో చేరబోతున్నారని తెలిసింది. ఈ నెల 18న హైదరాబాద్ లో అమిత్ షా ఆధ్వర్యంలో కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికిపాటి రామ్మోహన్ రావు ఓ 20 మంది నేతలతో కలిసి 18న బీజేపీలో చేరుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నేతల్లో మోత్కుపల్లి కూడా ఒకరని సమాచారం. అయితే ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మోత్కుపల్లితో భేటీ అయ్యి పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి మోత్కుపల్లి కూడా ఓకే చెప్పారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఈ తరుణంలోనే ఆయన గవర్నర్ ఆశలు మళ్ళీ చిగురించాయని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ పొత్తుతో పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ గెలిచాయి. అయితే తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాకపోయిన ఏదొక పదవి వస్తుందని నేతలు ఆశించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, మోత్కుపల్లి గవర్నర్ కాబోతున్నారని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ మోత్కుపల్లిని ఏదొక రాష్ట్రానికి గవర్నర్ గా పంపుతుందని తెలిపారు.

ఇక అదే ఆశతో ఉన్న మోత్కుపల్లి ఆ అవకాశం కోసం ఎదురుచూశారు. మూడు సంవత్సరాలు గడిచిన ఆయన ఆశ తీరలేదు. ఈ లోపు టీడీపీ-బీజేపీ పొత్తు పెటాకులు అయ్యాయి. దీంతో అధినేత కనీసం రాజ్యసభ ఇస్తారని అనుకున్నారు. కానీ అది అవ్వలేదు. ఆ తర్వాత మోత్కుపల్లి విలీనం వ్యాఖ్యలు చేయడం, పార్టీనుంచి సస్పెండ్ అవ్వడం, అధినేతని మోత్కుపల్లి తిట్టడం, టీడీపీ ఏపీ ఎన్నికల్లో ఓడిపోవడం చకచకా జరిగిపోయాయి.

READ ALSO  బ్రేకింగ్‌ : పార్టీ మార్పుపై గంటా క్లారిటీ..!

అయితే ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లనుండటంతో గవర్నర్ కలలు కంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడు కుదరకపోయిన ఇప్పుడైనా తనని ఏదొక రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారని ఆశ పడుతున్నారు. బీజేపీలో చేరిన వెంట‌నే ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌డం కుద‌ర‌దు. కొద్ది రోజులు ఆగాలి. మోత్కుప‌ల్లి బీజేపీ అధిష్టానంతో మాట్లాడి తన కోరికని బయపెట్టాలని అనుకుంటున్నారు. మరి చూద్దాం మోత్కుపల్లి గవర్నర్ ఆశలు ఈసారైనా నెరవేరతాయో లేదో.. !