వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్ గా నడుస్తోంది. ఆయన సీఐడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని అంతా ఆరోపిస్తున్నారు. అయితే ఆయన మాత్రం సహాయకులను దగ్గర పెట్టుకుని వీల్ చైర్లో తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన మరో ట్విస్టుకు తెరలేపారు. తనపై జరిగిన దాడికి వ్యతిరేకంగా వరుస ఫిర్యాదులు చేస్తూ అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారు.
తనపై వైసీపీ ప్రభుత్వం మోపిన రాజద్రోహం కేసు, పోలీసులు కస్టడీలో కొట్టారంటూ తాజాగా లోక్‌సభ స్టాండింగ్ కమిటీకి లేఖ రాశారు. ఇక్కడ విషయం ఏంటంటే స్టాండింగ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్న రఘురామ కమిటీలో ఉన్న మిగతా ఎంపీలకు లేఖలు రాసినట్లు సమాచారం.
ఇక దీనిపై లేఖలు అందుకున్న ఎంపీలు మండిపడుతున్నారు. ఒక ఎంపీపై ఇలాంటి దాడి ఏంటంటూ పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఎంపీ రఘురామను క్రూరంగా కొట్టడం ఏపీ పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనమన్నారు. ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. మిగతా ఎంపీలు కూడా సోషల్ మీడియా వేదికగా తమ విమర్శలను తెలియజేస్తున్నారు. ఇలాంటి ఘటనలు వైసీపీ అవినీతికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.