ఆ ఎంపీ జిల్లా విభజన సమస్యను మరో మలుపు తిప్పారా ?

-

ఏడాదిన్నరగా జిల్లాలో ఏం జరుగుతున్నా ఆ ఎంపీ పెద్దగా పట్టించుకోలేదు. తమ పనికూడా అధికార పార్టీ నేతలే చేసేస్తున్నా కనీసం నోరు మెదిపిందీ లేదు. ఉన్నట్టుండి సైలెన్స్‌ను బ్రేక్‌ చేశారు. జిల్లాల విభజనపై సోషల్‌ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు విభజన పాలిటిక్స్ నడుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ నోరుమెదపని తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు జిల్లా విభజనపై యుద్ధం చేస్తామంటూ ప్రకటనలివ్వడం చర్చకు దారితీస్తోంది.

 

 

పార్లమెంట్ నియోజకవర్గం వారీగా విభజన జరిగితే శ్రీకాకుళం జిల్లాకు మిగిలేది శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, పాతపట్నం నియోజకవర్గాలే. మిగిలిన ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంట్‌కు , పాలకొండ అరకు పార్లమెంట్‌కు వెళ్లిపోతాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాలు వెళ్లిపోతే శ్రీకాకుళం జిల్లాకు మిగిలేది సున్నాయేనని పార్టీలకు అతీతంగా నేతలు చెప్పే మాట.

ఈ అంశంపై శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఒక్కరే ముందుగా స్పందించారు. జిల్లాకు నష్టం జరుగుతుందని ఆయన వెల్లడించిన అభిప్రాయాలు అధికార పార్టీలోనూ కాక పుట్టించాయి. ఇంతలో మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ఆయనకు వంత పాడటంతో కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామాలను మౌనంగా వీక్షించారే తప్ప తమ అభిప్రాయం ఏంటో చెప్పలేదు టీడీపీ నాయకులు. తెలుగుదేశం నేతల మౌనంపైనా చర్చ సాగింది. ఏడాదిన్నరగా ముఖ్యమంత్రికి, ప్రధానికి వివిధ అంశాలపై లేఖలు రాస్తూ కాలక్షేపం చేసిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఇప్పుడు జూలు విదిల్చారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాను ముక్కలు కానియ్యబోమని చెబుతున్నారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు. ఈ సందర్భంగా మూడు అంశాలను ప్రధానంగా సమ్మిళితం చేసి ముందుకు సాగుతున్నట్టు చర్చ జరుగుతోంది. అందులో ఒకటి సెంటిమెంట్‌. జిల్లా విభజనను సెంటిమెంట్‌ అంశంగా మార్చడం ఒక ఎత్తుగా చెబుతున్నారు. ఈ సమయంలో టీడీపీ బలోపేతానికి ఎంపీ దృష్టి పెడుతున్నట్టు సమాచారం. అంతేకాదు.. దీనినో ఉద్యమంగా తలకెత్తుకుంటే వ్యక్తిగతంగా కూడా ప్రతిష్ట పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారట.

ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రస్తావిస్తున్న అంశాలు.. సంధిస్తున్న ప్రశ్నలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయని అనుకుంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్‌ ప్రాతిపదికగా జిల్లాను విభజిస్తారు సరే.. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెబుతున్నారు. అప్పుడేం చేస్తారు అని ప్రశ్నిస్తున్నారట రామ్మోహన్‌ నాయుడు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలో 2026లో మార్పులు చేర్పులు వస్తే ఇబ్బంది కాదా అన్నది ఎంపీ మాట.

Read more RELATED
Recommended to you

Latest news