ఏపీలో అధికార పార్టీ టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీలోకి వలసలు పెరుగుతుండడంతో.. ఇప్పుడు టీడీపీకి గుండెల్లో గుబులు పుట్టుకుంది. ఇప్పటికే అనేక మంది టీడీపీ ముఖ్య నేతలు వైకాపా బాట పట్టారు. తాజాగా మరో టీడీపీ ఎంపీ కూడా వైకాపాలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎంపీ తోట నర్సింహులు వైసీపీ తీర్థం పుచ్చుకోన్నారని సమాచారం. అందుకు గాను ఆయన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలిసింది.
టీడీపీ ఎంపీ తోట నర్సింహులు తన భార్య వాణికి జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. కాగా ఈ టిక్కెట్టును ఇప్పటికే జ్యోతులు నెహ్రూకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తోట నర్సింహులు జగ్గంపేట టిక్కెట్టు ఇవ్వకపోతే వైకాపాలో చేరుతానని చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. కాగా జగ్గంపేట టిక్కెట్టు జ్యోతుల నెహ్రూకే 100 శాతం ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసినా నర్సింహులు మాత్రం అదే స్థానాన్ని ఆశిస్తుండడం వెనుక రాజకీయ వ్యూహం ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే తోట నర్సింహులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారట. కానీ ఏదైనా బలమైన కారణం చెబితేనే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని అటు టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కాగా 2014 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగా పనిచేసిన తోట నర్సింహులు, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు..!