కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు.గత రెండు నెలల నుంచి ఆయన వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నా ముద్రగడ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఆయనతో ఎంపీ మిథున రెడ్డి చర్చలు జరిపారని,వైసీపీలోకి ముద్రగడ ఎంట్రీ ఖాయమని గతంలో అనేకసార్లు వైరల్ వార్తలు వచ్చాయి. పవన్ లక్ష్యంగా చేసుకుని ఆయన లేఖలు విడుదల చేయడంతో పార్టీ మార్పు ఖాయమనే అనుకున్నారు అందరూ. అయితే రెండు నెలలుగా సైలెంట్ అయ్యారు ముద్రగడ.
ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఇక ముద్రగడ కూడా ఆలస్యం చేయకుండా వైసీపీలో చేరి ఏదో ఒక అసెంబ్లీ స్థానం ఖరారు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.కాపు ఉద్యమ నేతగా పేరున్న పద్మనాభం…మంచి టైమ్ చూసుకుని వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.త్వరలోనే తేదీని కూడా ప్రకటిస్తానని స్వయంగా ముద్రగడ తెలిపారు. సీఎం జగన్ (CM Jagan) ఆదేశాలతో ఆ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇంఛార్జీ దావులూరి దొరబాబు, జగ్గంపేట ఇంఛార్జీ తోట నరసింహం తదితరులు తాజాగా ముద్రగడ నివాసంలోనే భేటీ అయ్యి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.అక్కడి నుంచే ముద్రగడ పద్మనాభం ను పోటీకి దింపాలని వైసీపీ చూస్తోంది. ముద్రగడ అయితే గంపగుత్తగా కాపు ఓట్లను కొల్లగొట్టి పవన్ ని సునాయాసంగా ఓడించవచ్చని వైసీపీ భావిస్తోంది. మరోవైపు ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.స్వతహాగా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారని ,పెద్దలను ఎలా గౌరవించాలో సీఎం జగన్ కి తెలుసని ముద్రగడతో భేటీ అనంతరం వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు.