మల్కాజిగిరిలో మైనంపల్లి ప్రత్యర్ధి ఎవరు?

-

కేసీఆర్… బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి రాజకీయాలన్నీ రసవత్తరంగా మారాయి. అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుండి కేసీఆర్ కు తలనొప్పులు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. అయితే అప్పటికి తన కుమారుడుకు మెదక్ అసెంబ్లీ సీటు కోసం మైనంపల్లి ట్రై చేస్తున్నారు.

అదే సమయంలో తన కుమారుడుకు సీటు రాకుండా హరీష్ అడ్డుకుంటున్నారని, ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ అప్పటికే మైనంపల్లికి బి‌ఆర్‌ఎస్ సీటు ఖాయమైంది. ఈ సమయంలో మైనంపల్లిపై కే‌సి‌ఆర్ వేటు వేస్తారని అంతా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల వరకు ఏం జరగలేదు. తాజాగా మైనంపల్లి బి‌ఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరబోతున్నారు.

దీంతో మల్కాజిగిరిలో బిఆర్ఎస్ అభ్యర్థి కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. అంగబలం అర్ధబలంలో మైనంపల్లికి దీటుగా ఉన్న అభ్యర్థి కోసం వెతుకుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నారు. మల్కాజిగిరి స్థానం కోసం చాలామంది స్థానిక నేతలు, ఉద్యమకారులు  అడుగుతూనే ఉన్నారు. కానీ సామాజికంగా, రాజకీయంగా మైనంపల్లి కి చెక్ పెట్టే అభ్యర్థి కోసం కేసీఆర్ శోధిస్తున్నారు. మైనంపల్లికి చెక్ పెట్టడానికి అనుకూలంగా ఉన్న పోలీసు, రెవెన్యూ అధికారులను బదిలీలలపై పంపుతూ మల్కాజిగిరిలో ఆపరేషన్ చేపట్టారు. బిఆర్ఎస్ అభ్యర్థి కోసం అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించారు.

మల్కాజిగిరి టికెట్ కోసం ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. చింతల కనకా రెడ్డి కోడలు కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓసి, బిసి, మహిళ ఓట్లు తమకు అనుకూలంగా మారే విధంగా మల్కాజిగిరిలో అభ్యర్థిని ప్రకటిస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతామని బిఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తో  కేటీఆర్  సుదీర్ఘంగా చర్చించారని విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటినుండి మల్కాజిగిరి టికెట్ రాజశేఖర్ రెడ్డి కి ఇచ్చారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధిష్టానం అభ్యర్థి పేరు ప్రకటించే వరకు మల్కాజిగిరిలో కారు నడిపేది ఎవరో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version