- మన కులం, మతం, ప్రాంతం ఆంధ్ర
- జగన్,పవన్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే!
- తాడేపల్లి గూడెం ధర్మపోరాట సభలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా తెచ్చేది చంద్రన్నేనని పంచాయతీరాజ్, ఐటీశాఖా మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2019 ఎన్నికల్లో 25 పార్లమెంట్ సీట్లు గెలిచి ఢిల్లీ లో చక్రం తిప్పేదీ చంద్రబాబుగారేనని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ర్ట విభజనచట్టంలో పేర్కొన్న 18 అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చినవారినే ప్రధానమంత్రిని చేస్తామని మంత్రి చెప్పారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ధర్మపోరాట సభలో మంత్రి నారా లోకేష్..ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని పదునైన ప్రసంగంతో నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జీరో అని తెలిసినా, కేవలం ప్రత్యేక హోదా ఇస్తుందని, విభజనతో పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తుందని పొత్తు పెట్టుకున్నామన్నారు.
మిత్రధర్మం పాటించిన నాలుగేళ్లలో మొదటి సంవత్సరం హోదా ఇస్తామని, రెండో ఏడాది ఇదిగో ఇచ్చేస్తున్నామని, మూడో సంవత్సరం హోదా ఎవ్వరికీ ఇవ్వడం లేదని, హోదా కు మించిన ప్యాకేజ్ ఇస్తాం అని ఏపీ చెవిలో క్యాబేజీ పెట్టారని మంత్రి ఆరోపించారు. ఏఐఐబి రుణాలిస్తామని, నాబార్డ్ కింద నిధులిస్తామని, ఆ తరువాత స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నిధులిస్తామని ఏపీని నిలువున్నా ముంచేశారని విమర్శించారు. మనకు ధర్మంగా రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం మొదలు పెడితే.. మోడీ తన దత్తపుత్రుడు పవన్, అవినీతిపుత్రుడు జగన్‌లతో కలిసి అధర్మపోరాటానికి తెరతీశారని లోకేష్ ఆరోపించారు. హోదా ఎందుకు ఇవ్వరని మోడీని అడిగితే..ఈడీ పేరుతో బెదిరిస్తున్నారని..విభజన చట్టం అమలు చేయమని అడిగితే సీబీఐ దర్యాప్తు అంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని..ఇది ఒక దేశ ప్రధానికి తగునా అని ప్రశ్నించారు.
తెలుగువారి ఆత్మగౌరవం నినాదంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ పెద్దలను గడగడలాడించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు పార్టీ ఇది..మీరు బెదిరిస్తే బెదిరిపోదు..భయపెడితే లొంగిపోదని లోకేష్ ఘాటుగా హెచ్చరించారు. తెలుగు వాళ్లకి అన్యాయం చేస్తే ఏమవుతుందో కర్ణాటకలో బీజేపీకి ట్రైలర్ చూపించామని, ఇక 2019లో పూర్తి సినిమా చూపిస్తామని మంత్రి చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కులం,మతం,ప్రాంతం పేరుతో మన మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని,అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మన కులం, మతం, ప్రాంతం ఆంధ్ర అని..అందరమూ ఒక్కటై అభివృద్ధి సాధించుకుందామని పిలుపునిచ్చారు. బీజేపీనాయకులు రాయలసీమడిక్లరేషన్ అంటే, ఇప్పుడు పవన్ ఉత్తరాంధ్ర డిక్లరేషన్ అంటున్నారని, కులం ముసుగులో మరొకరు రైళ్లు తగలబెట్టించారని ..ఈ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని లోకేష్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడదామని ప్రయత్నించినా.. అణగదొక్కేయాలని చూసినా.. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ గా నిలిచామన్నారు. పట్టిసీమ పనికిరానిదని ప్రచారం చేశారని, పట్టిసీమ నుంచి అందిన నీటితో ఒక్క ఏడాదితో వేలకోట్ల రూపాయల విలువైన పంటలు పండాయని చెప్పారు. అమరావతిని భ్రమరావతి అని ప్రచారం చేసారని, అమరావతి బాండ్లు పెడితే 60 నిమిషాల్లో అమ్ముడు పోయి 2 వేల కోట్లు వచ్చాయని, ఇది మన చంద్రన్నపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు.