వైసీపీలో ఫైటింగ్‌: లేడీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ

-

ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు అయ్యిందో లేదో అప్పుడే చాలా జిల్లాల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌ల మ‌ధ్య ఎంత‌మాత్రం పొస‌గ‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో బాపట్ల ఎంపీ నందిగాం సురేష్- ఎమ్మెల్యే శ్రీదేవి మధ్య కొద్ది రోజులుగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. వాస్త‌వంగా చూస్తే సురేష్ బాప‌ట్ల నుంచి ఎంపీగా ఉన్నా ఆయ‌నది తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోసం సురేష్ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తూ త‌నకంటూ ఓ వ‌ర్గం ఏర్ప‌రుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు.

ముఖ్యంగా ఇసుక ర్యాంపుల వివాదంలో అటు సురేష్‌, ఇటు శ్రీదేవి ఇద్ద‌రూ త‌ల‌దూర్చార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాగే సీఆర్డీఏకు సంబంధించి కూడా వీరిద్దరి మధ్యన విబేధాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. గ‌తంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య క్ర‌ష‌ర్ల వివాదం కూడా జ‌రిగింది. అప్ప‌ట్లో ఇరు వ‌ర్గాలు ఒక‌రి ఫ్లెక్సీలు మ‌రొక‌రు చించేసుకుని వార్త‌ల్లోకి ఎక్కారు. సురేష్ నా నియోజ‌క‌వ‌ర్గంలో ఎందుకు జోక్యం చేసుకోవాలంటూ శ్రీదేవి నేరుగా జ‌గ‌న్‌కే ఫిర్యాదు చేసింది.

శ్రీదేవి గ‌త ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందే హైద‌రాబాద్‌లో డాక్టర్ వృత్తిని వ‌దిలి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. అయితే స్థానిక నేత‌గా ఉన్న సురేష్‌కు జ‌గ‌న్ చివ‌ర్లో బాప‌ట్ల ఎంపీ సీటు ఇచ్చారు. ఆయ‌న బాప‌ట్ల‌లో గెలిచినా మ‌న‌సంతా తాడికొండ మీదే ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనూ త‌న‌కంటూ బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఏర్పాటు చేసుకుని స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవికి పొగ పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది శ్రీదేవికి మంట పుట్టిస్తోంది.

ఇప్పుడు వీరిద్ద‌రి ఆధిప‌త్య పోరు ముదిరి పాకాన ప‌డింది. మ‌ధ్య‌లో సురేష్‌కు తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని పార్టీ అధిష్టానం చెప్పినా శ్రీదేవికి వ్య‌తిరేకంగా నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు క‌డుతుండ‌డంతో తాడికొండ వైసీపీలో ఆధిప‌త్య పోరు మంచి ర‌స‌క‌యందాయంలో ప‌డింది. మ‌రి వీరిద్ద‌రిలో ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గే ప్ర‌శ‌క్తి లేక‌పోవ‌డంతో ఇది భ‌విష్య‌త్తులో ఎటువైపున‌కు దారి తీస్తుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news