రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు ఆస‌క్తిగా మారాయి. ముఖ్యంగా ఏపీలో ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీకి ఇప్పుడు బ‌ల‌మైన నాయ‌కుడు ల‌భించాడ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 2014లో బీజేపీతో అంట‌కాగిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. త‌ర్వాత కాలంలో విభేదించారు. నేరుగా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, అప్ప‌టి కేంద్ర మంత్రి వెంక‌య్య‌పై విరుచుకుప‌డ్డారు. అదే స‌మ‌యంలో మోడీతో నూ ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో బీజేపీ నేత‌లుకూడా అప్ప‌ట్లో ప‌వ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై కూడా రాజ‌కీయ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ నేప‌థ్యంలోనే ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎవ‌రికి వారుగా పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పార్టీకి 4% ఓట్లు ల‌భించ‌గా.. బీజేపీకి ఈ మాత్రం కూడా ద‌క్క‌లేదు. అయితే, రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌తృవులు లేర‌ని అన్న‌ట్టుగా.. ఏపీలోనూ బీజేపీకి ప‌వ‌న్ మ‌ళ్లీ చేరువ‌య్యారు. ఇటీవ‌ల ఆయన చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ప్ర‌జ‌ల కోసం, రాష్ట్రం కోస‌మే తాను బీజేపీని విమ‌ర్శించాన‌ని, తాను ఎప్పుడూ బీజేపీకి దూరం కాలేద‌ని, ఒక‌వేళ అయి ఉంటే చెప్పాల‌ని ఎదురు ప్ర‌శ్న సంధించారు. దీంతో బీజేపీకి ఆయ‌న మ‌ళ్లీ మౌత్ పీస్ కానున్నార‌నే ప్ర‌చారానికి బ‌లం చేకూరింది.

ఇక‌, బీజేపీకి రాష్ట్ర సార‌ధిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు సంధించారు. అనేక ఉద్య‌మాలు కూడా చేశారు. అలాంటి నాయ‌కుడు హ‌ఠాత్తుగా మౌనం పాటించారు. దీనికి ముందు ఒక విష‌యం జ‌రిగింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీ పెద్ద‌లను క‌లిసారు. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఆయ‌న కొన్ని ఫిర్యాదులు చేశార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

ఈ విష‌యం అలా ఉంచితే, ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని ఏపీకి వ‌చ్చిన వెంట‌నే నిర్వ‌హించిన ప్ర‌తి స‌మావేశంలోనూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడ‌డం ప్రారంభించారు. కేంద్రంలో అమిత్ షా, మోడీ వంటి నాయ‌కులు బ‌లంగా ఉన్నార‌ని, అలాంటి ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, అంబేడ్క‌ర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోడీని బ‌ల‌మైన నాయ‌కుడిగా మ‌హాత్ముడిగా అభివ‌ర్ణించారు. అలాంటి నాయకుడు దేశానికి అవ‌స‌రం అన్నారు. నిజానికి కొన్ని ద‌శాబ్దాలుగా బీజేపీలో ఉన్న ఏపీ నాయ‌కులు కూడా ఏనాడూ ఇలా మోడీని ఆకాశానికి ఎత్తిన సంద‌ర్భం లేదు.

దీంతో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కూడా సంచ‌ల‌నంగా మార‌డం, అదే స‌మ‌యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ క‌న్నా సైలెంట్ అయిపోవ‌డం చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీకి ప‌వ‌నే సార‌ధ్యం వ‌హిస్తారా? అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌న పార్టీని బీజేపీలో విలీనం చేయ‌క‌పోయినా.. ప్ర‌ధానంగా బీజేపీ త‌ర‌ఫున ప‌వ‌నే క్యాంపెయిన్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.