ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో ఈ సారి రాజకీయ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట నుంచి పోరు ఆసక్తికరంగానే ఉంటుంది. అప్పటిలో టిడిపి, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచేది. ఇక్కడ టిడిపి నాలుగుసార్లు విజయం సాధించింది. అందులో రెండుసార్లు రావుల చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ 1952 నుంచి 1980 వరకు వరుసగా గెలిచింది. తర్వాత 1989, 1999, 2004 ఎన్నికల్లో గెలిచింది. మూడుసార్లు కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి గెలిచారు.
2009లో ఓడిపోగా, 2014 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించారు. 2018 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా బిఆర్‌ఎస్ గాలి వీచింది. దీంతో బిఆర్‌ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గెలిచారు. దాదాపు 51 వేల ఓట్ల భారీ మెజారిటీతో చిన్నారెడ్డిపై గెలిచారు. అలాగే కేసిఆర్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. అక్కడ నుంచి వనపర్తిపై నిరంజన్ పట్టు సాధించి దూసుకెళుతున్నారు. అధికార బలంతో సత్తా చాటుతున్నారు.
కాకపోతే ఆ అధికార బలమే కాస్త వ్యతిరేకతగా మారుతుంది. ఇప్పుడు సర్వేల్లో మంత్రికి అంత అనుకూలత కనిపించడం లేదు. కాస్త యాంటీ కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ఈ సారి గెలవడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ నేతలు సీటు దక్కించుకోవడానికి చూస్తున్నారు..కానీ వనపర్తి సీటు చిన్నారెడ్డికే దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
దీంతో మరోసారి నిరంజన్, చిన్నారెడ్డిల మధ్య హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ బిజేపికి పెద్ద బలం లేదు. అయితే టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి కాస్త పట్టు ఉంది. ఒకవేళ ఆయన టిడిపి నుంచి పోటీ చేస్తే..10-20 వేల ఓట్లు తెచ్చుకున్నా సరే..ఆ ప్రభావం వల్ల గెలుపోటములు తారుమారు అవుతాయి. టిడిపి పోటీ చేయకపోతే ఇబ్బంది ఉండదు. మొత్తానికి బిఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య పోరు జరగనుంది. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.