ఆసక్తికరంగా నిజామాబాద్ పోలింగ్.. బరిలో 185 మంది.. బ్యాలెట్ పోరే..!

-

నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవిత టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండటం.. ఇదే నియోజకవర్గం నుంచి పసుపు, ఎర్రజొన్న రైతులంతా స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.

తెలంగాణలోని నిజామాబాద్ లో పోలింగ్ ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పార్లమెంట్ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహిస్తారు. కానీ.. నిజామాబాద్ లో 185 నామినేషన్లు వేశారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు వీరిలో ఏడుగురు ఉండగా… మిగిలిన వాళ్లు అంతా రైతులే. వాళ్లంతా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. దీంతో తొలి విడత ఎన్నికల్లో అత్యధిక మంది బరిలో ఉన్న స్థానం ఇదే.

నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవిత టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండటం.. ఇదే నియోజకవర్గం నుంచి పసుపు, ఎర్రజొన్న రైతులంతా స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే.. రైతులను కావాలని రెచ్చగొట్టి వారితో నామినేషన్ వేయించారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ కవితను ఎలాగైనా ఓడించాలన్న దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు కావాలని ఇలా రైతులతో నామినేషన్ వేయిస్తున్నారని.. రైతులకు దీనితో ఎటువంటి సంబంధం లేదని టీఆర్ఎస్ పార్టీ చెబుతోంది.

అయితే.. నామినేషన్ల ఉపసంహరణ వరకు రైతులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని అంతా భావించారు. కానీ.. నామినేషన్లను రైతులు ఉపసంహరించుకోలేదు. దీంతో 185 మంది రైతులు బరిలో నిలిచారు. దీంతో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలి. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈవీఎంల ద్వారా 4 యూనిట్లతో గరిష్ఠంగా 96 మంది అభ్యర్థులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించవచ్చు. ఈ స్థానంలో అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో నిలుస్తుండటంతో బ్యాలెట్ పోరు తప్పనిసరి అయింది.

కొత్తగా వచ్చిన ఈవీఎంలు ఉంటే.. 383 మంది అభ్యర్థులకు కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించవచ్చు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో ఈసీ పాత ఈవీఎంలనే ఉపయోగిస్తోంది. దీంతో పాత ఈవీఎంలు 96 మందికి మాత్రమే ఎన్నికలు నిర్వహించగలవని… రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో దేశమంతా పార్లమెంట్ ఎన్నికలు ఈవీఎంలతో జరుగుతుంటే.. నిజామాబాద్ లో మాత్రం బ్యాలెట్ తో జరుగుతుండటంతో ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version