పెందుర్తి టిడిపిలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. చంద్రబాబు నాయుడు తీరుపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నేతలను పక్కన పెట్టేసి.. డబ్బు సంచులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.. తెలుగుదేశం ప్రకటించిన రెండో జాబితాలోనూ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ పేరు లేకపోవడంపై ఆయన అనుచరులు అధినేత తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారట. పెందుర్తి అసెంబ్లీ టికెట్ ను పొత్తుల్లో భాగంగా చంద్రబాబు జనసేనకు కేటాయించారు..
పార్టీ ఆవిర్భావం నుంచి బండారు సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు.. మాజీ మంత్రిగా, సీనియర్ నేతగా తెలుగుదేశం పార్టీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఆర్థిక స్తోమత లేదనే సాకుతో చంద్రబాబు బండారు సత్యనారాయణ పక్కన పెట్టేసారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో నుంచి జనసేన అభ్యర్థిగా రమేష్ బాబు బరిలో దిగనున్నారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి.. రమేష్ బాబుకు సహకరించే ప్రసక్తే లేదని బండారు సత్యనారాయణ అనుచరులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. దీంతో పెందుర్తి నియోజకవర్గంలో అసమ్మతి జ్వాలలు తీవ్రస్థాయికి చేరాయనే ప్రచారం జరుగుతుంది..
పెందుర్తి టికెట్ తనకే దక్కుతుందంటూ బండారు సత్యనారాయణ చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే రమేష్ బాబుకు టికెట్ కేటాయిస్తామని టిడిపి లీకులు ఇవ్వడంతో బండారు అప్రమత్తమై చంద్రబాబును సైతం కలిశారట. కానీ చంద్రబాబు నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో.. బండారు అవమానంగా ఫీల్ అయ్యారట. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని బండారు ఆలోచిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పొత్తుల పేరుతో సీనియర్లను చంద్రబాబు కావాలనే పక్కన పెడుతున్నారని.. పెందుర్తిలో టిడిపి బలంగా ఉన్నప్పటికీ జనసేనకు టికెట్ ఇవ్వడం ఏంటనీ వారు ప్రశ్నిస్తున్నారు.. కావాలనే బండారు సత్యనారాయణ చంద్రబాబు పక్కన పెట్టేసారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తిలో బండారు సహకారం లేకుండా జనసేన గెలవడం అసాధ్యమని.. రమేష్ బాబు ఎలా గెలుస్తారో చూస్తామంటూ టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారట