ఏపీలో వైసీపీలో జగన్ తర్వాత, ఆ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించే నాయకుడు ఎవరంటే అందరూ ఠక్కున విజయసాయిరెడ్డి పేరే చెబుతారు. అంతలా జగన్ తర్వాత విజయసాయి పార్టీ కోసం కష్టపడుతున్నారు. విజయసాయి…విశాఖపట్నం వేదికగా రాజకీయాలు చేస్తూ, ప్రతిపక్ష టిడిపికి చుక్కలు చూపిస్తున్నారు. అందుకే ఆయనని ప్రత్యర్ధులు ‘విశాఖ’ సాయిరెడ్డి అని కూడా పిలుస్తారు. గత కొన్నేళ్లుగా ఆయన విశాఖలో నివాసం ఉంటున్నారు. అలా అని ఆయన భారీ భవంతులలో ఉండరు. ఒక అపార్ట్‌మెంట్‌లో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్‌లో నివసిస్తారు.
2015లో విశాఖ వచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే రాజకీయంగా అగ్ర స్థానానికి చేరుకున్నారు. అసలు ఇప్పటివరకు విశాఖకు ఎంతో మంది నాయకులు వలస వచ్చారు. కానీ వారెవరూ సాయిరెడ్డి మాదిరిగా ఇంతలా దూకుడు చూపించలేదు. ఇక విజయసాయిరెడ్డిలో మల్టీపుల్ టాలెంట్ ఉంది… ఆయన క్లాస్. ఆయన పక్కా మాస్ కూడా.
దేశంలో టాప్ టెన్‌లో ఉండే చార్టెడ్ అకౌంటెంట్. అదే సమయంలో విజయసాయికి ఏ విషయం మీద అయినా స్పష్టంగా మాట్లాడగల సత్తా ఉంది. అలాగే రాజకీయాల్లో మాస్ కావాలి అంటే దానికీ తయారుగా ఉంటారు. విజయసాయి ముందు టీడీపీకి కంచుకోట లాంటి విశాఖలో తమ్ముళ్ళు వెనక్కి తగ్గిపోతున్నారు. అలాగే చేతిలో అధికారం లేని సమయంలో కూడా విజయసాయిరెడ్డి వాయిస్ ఎక్కడా తగ్గలేదు. గతంలో విశాఖలో టీడీపీ భూ దందాను వెలికి తీసి తమ్ముళ్ళ గుండెల్లో గుబులు పుట్టించారు. ఇపుడు వరస దాడులు చేయిస్తూ అక్రమార్కులకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నారు.
ఇక విజయసాయి సారధ్యంలో 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రా అంతటా వైసీపీ ఊపేసింది. ఇక ఈ ఏడాది జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. విశాఖలో పెద్ద నాయకులను అందరికీ వైసీపీ గూట్లోకి లాగేసి ఫ్యాన్ పార్టీని పటిష్టం చేయడమే కాదు టీడీపీకి వణుకు పుట్టించే వ్యూహాలు పన్నడంతో విజయసాయిరెడ్డి స్టైలే వేరు. ఇక టిడిపికి వణుకు పుట్టిస్తున్న విజయసాయి…. ఇక విశాఖలోనే సెటిల్ అయిపోతానని అంటున్నారు. ఇప్పటివరకు అద్దె ఇంట్లో ఉంటున్న విజయసాయి… భీమిలిలోని తన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానని, విశాఖలోనే తన తనువు చాలిస్తానని చెబుతున్నారు. అంటే విశాఖలో టిడిపికి ఇంకా చుక్కలు కనబడనున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా విజయసాయిని ఢీకొట్టే సత్తా ఇప్పుడు టిడిపికి ఉన్నట్లు లేదు.