రైతు సమన్వయ అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి… అసలు ఆయన నేపధ్యం ఏంటి..?

-

రైతుల సమస్యలను తీర్చడానికి సీఎం కేసీఆర్‌ రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షడుగా ఎమ్మెల్సీ, తెరాస ప్రధాన కార్యదర్శిగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ నియమిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నియామక ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల నియామకం జరుగుతుందని… జూన్‌లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు,

రైతు సమన్వయ సమితులను బలోపేతం చేస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. తద్వారా రైతులను సంఘటిత శక్తిగా… మారుస్తామన్నారు. అదే విధంగా క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం పూర్తి చెయ్యాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై మరో నాలుగు రోజుల్లో కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో… ఈ సమీక్షలో రైతు వేదికల నిర్మాణం, రైతు సంబంధిత అంశాలు వంటివి చర్చకు రానున్నాయి. గతంలో ఈ సమితికి అధ్యక్షుడిగా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు.

ఒకసారి పల్లా రాజేశ్వర రెడ్డి నేపధ్యం చూస్తే… తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన పల్లాకు ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత ఎమ్మెల్సీగా కెసిఆర్ అవకాశం ఇచ్చారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు కెసిఆర్. ఇక అప్పటి నుంచి ఆయన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టె పలు పథకాల వెనుక పల్లా కీలకంగా వ్యవహరిస్తారని, ఉన్నత విద్యావంతుడు కావడంతో కెసిఆర్ కూడా ఆయనకు అమితమైన ప్రాధాన్యత ఇస్తారని తెరాస నేతలు అంటూ ఉంటారు. ఇక పలు రాజకీయ వ్యూహాల్లో కూడా పల్లా దిట్ట. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస విజయం వెనుక పల్లా రాజకీయ వ్యూహాలే కారణమని పరిశీలకులు సైతం అంటూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news