గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయంలో ఆయన పార్టీ అభ్యర్థులతో కాసేపు ముచ్చటించారు. ఈసందర్భంగా ఆయన ప్రజారాజ్యం పార్టీపై పై వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు ముగిశాయి. అంతా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకో పది రోజుల్లో అందరి భవితవ్యాలు తేలిపోనున్నాయి. అయితే.. ఎన్నికలు ముగిశాయి కదా అని ఎవ్వరూ ఇంట్లో ముసుగేసుకొని పడుకోలేదు. ఎవ్వరి టాక్టిక్స్ వాళ్లవి. మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని నొక్కి చెబుతున్నారు ప్రధాన పార్టీల నాయకులు. సరే.. ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ పార్టీ ఓడిపోతుంది.. ఎవరు ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.. అనే విషయాన్ని పక్కన బెడితే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తన అన్న మెగాస్టార్ చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో అందులో చేరిన వారంతా.. ఆశతో వచ్చిన వారేనని.. ఆశయంతో వచ్చిన వాళ్లు ఎవ్వరూ లేరని పవన్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయంలో ఆయన పార్టీ అభ్యర్థులతో కాసేపు ముచ్చటించారు. ఈసందర్భంగా ఆయన ప్రజారాజ్యం పార్టీపై పై వ్యాఖ్యలు చేశారు.
కానీ.. జనసేన పార్టీ స్థాపించిన సమయంలో సీట్ల గురించి.. పదవుల గురించి ఆలోచించలేదని.. ఎక్కడో ఒక్క చోట అయినా మార్పు రావాలన్న సదుద్దేశంతో పార్టీని ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి మీకు బహుమతిగా ఇస్తాం.. అని తనతో చాలామంది చెప్పారని… కానీ.. ఇది ప్రజాస్వామ్య దేశం.. ఇక్కడ అటువంటి పదాలకు తావులేదన్నారు.
మార్పు జనసేనతో మొదలైంది. అదే మా అసలైన గెలుపు. జనసేనకు ప్రాథమిక నిర్మాణమే లేదు.. అంటూ కొందరు విమర్శిస్తున్నారు. నిర్మాణం అనేది అంత తేలికైన విషయమా? మేము దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్తున్నాం. మార్పు ముందు.. ఎమ్మెల్యే అనే అంశం చాలా చిన్నది. ఈ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి.. అనే విషయంపై నేను దృష్టి పెట్టలేదు. నేను ఏది చేయాలో అది చేశా. పోరాటం చేశాం. లక్షలాది యువత మా వెంట ఉన్నారు. జనసేన బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు.. అంటూ పవన్ అన్నారు.