పవన్‌ తగ్గట్లేదు..వాలంటీర్ల ఓట్లు లెక్కలో లేవా?

-

ఏపీలో పవన్ వర్సెస్ వైసీపీ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ వార్ లో ఇప్పుడు వాలంటీర్లు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వీరిపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో మిస్ అవుతున్న మహిళలకు వాలంటీర్లే కారణమని, ప్రభుత్వ వాలంటీర్లుగా ఉంటూ..వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న వీరు..ఏ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు.వితంతువులు, ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని ఆ సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు అందజేస్తున్నారని ఆరోపించారు.

దీనిపై పవన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై పవన్ విమర్శలు చేయడం దారుణమని, కావాలని వాలంటీర్లని టార్గెట్ చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అటు వాలంటీర్లు సైతం నిరసనలు తెలియజేస్తూ..మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ సైతం..పవన్‌కు నోటీసులు ఇచ్చింది. అయినా సరే పవన్ వెనక్కి తగ్గడం లేదు..తాను అందరు వాలంటీర్లని అనడం లేదని..కొందరే ఆ పనులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదన్నట్లు చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ కొందరు వలంటీర్లు చేస్తున్న ఘాతుకాన్ని తెలియజేయాలనే చెప్పానని, ప్రజలను నియంత్రించేందుకు, బెదిరించేందుకే వలంటీర్‌ వ్యవస్థను జగన్‌ డిజైన్‌ చేసి వదిలాడని ఆరోపించారు. వారిపై అన్నీ పార్టీల వారు ఒక కన్నేసి ఉంచాలని వారు చేస్తున్న అక్రమాలని బయటపెట్టాలని అంటున్నారు. అయితే రాష్ట్రంలో కొందరు వాలంటీర్లపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

మహిళలని ఇబ్బంది పెడుతున్నారని, పింఛన్ డబ్బులు ఎత్తుకుపోతున్నారని, అలాగే వైసీపీకి మద్ధతు ఇవ్వకపోతే పథకాలు పోతాయని బెదిరిస్తున్నారని, అలాగే దొంగ ఓట్లు సృష్టించడం, టి‌డి‌పి, జనసేన ఓట్లు తొలగించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ సైతం వాలంటీర్లని టార్గెట్ చేశారు. అయితే వాలంటీర్లు దాదాపు 3 లక్షల వరకు ఉన్నారు. ఎలాగో వారు వైసీపీకి చెందినవారే..వైసీపీకి వారి ఓట్లు పడతాయి. అందుకే పవన్ వారిని గట్టిగా టార్గెట్ చేశారని అంటున్నారు. కానీ వారి చేసే పనులతో ప్రజలు విసిగెత్తి పోయి ఉన్నారని, దాని వల్ల ప్రజల మద్ధతు తమకు వస్తుందనే ప్లాన్ లో పవన్ లో ఉన్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news