ఆయన మరణం తీవ్రంగా కలచివేసిందన్న పవన్ కల్యాణ్

-

ప్రకృతిని పరిరక్షించాలని తపనపడే జి.డి. అగర్వాల్ లాంటి మహనీయుడిని కోల్పోవడం.. జాతి చేసుకున్న దురదృష్టమని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హరిద్వార్ లోని పవన్ సదన్ ఆశ్రమంలో జరిగిన జి.డి.అగర్వాల్ సంస్మరణ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అగర్వాల్ సేవలను పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు.

గంగా ప్రక్షాళన కోసం 111 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేసిన
జి.డి. అగర్వాల్.. ఐఐటీలో విద్యాభ్యాసంతో పాటు.. ఉన్నత విద్యావంతులకు బోధన చేసిన గొప్ప జ్ఞాని. చివరి దశలో సన్యాసాన్ని స్వీకరించారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన సంస్మరణ సమావేశంలో పవన్ కల్యాణ్‌తో పాటు రామన్ మెగససే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్, ప్రొఫెసర్ విక్రమ్ సోనీ, జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు యూసఫ్ అర్హం ఖాన్, బొలిశెట్టి సత్య, బస్వరాజ్ పాటిల్, రమేష్ శర్మ, మిశ్రా తదితర నాయకులు పాల్గొన్నారు.

తొలుత ప్రొఫెసర్ అగర్వాల్ చిత్రపటానికి పవన్ కల్యాణ్, ఇతర ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారని తెలిసి.. ఆయన ఆత్మత్యాగం చేయకుండా, ప్రభుత్వం స్పందిస్తుందని భావించానని, అయితే.. దురదృష్టవశాత్తూ ఏ ప్రభుత్వమూ ఆయన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జి.డి.అగర్వాల్ మరణ వార్త తనను విపరీతంగా కలచివేసిందని, భారతదేశం తన ఆత్మను కోల్పోతోందన్న వేదన కలిగిందని అన్నారు. అగర్వాల్ మృతిపై దేశం మొత్తం తిరగబడుతుందని భావించానని అయితే. కనీసం ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా ప్రజా స్పందన లేకపోవడం విస్మయానికి గురిచేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. గంగానది దేశం మొత్తానిది గంగ ఉత్తర భారతానికో..పశ్చిమ లేదా తూర్పు ప్రాంతాలకో చెందింది కాదని.. ఇది యావద్భారతదేశానికి సంబంధించినదని పవన్ కల్యాణ్ అన్నారు.

మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని కాపాడేందుకు.. ఆత్మత్యాగం చేసిన జి.డి.అగర్వాల్ స్పూర్తితో.. గంగను పరిరక్షించుకోవడం తన ప్రాథమిక హక్కు అని భావిస్తున్నట్లు చెప్పారు. అగర్వాల్ లాంటి మహాత్ముడి ఆశయాల సాధనకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news