ఆంధ్రావనిలో పీఆర్సీకి సంబంధించి రాజుకున్న రగడ పూటకు కాదు గంటకూ కాదు నిమిషానికో మలుపు తిరుగుతోంది.పండగ పూట ఉద్యోగులంతా భోగి మంటల్లో కొన్ని కాయితాలు విసిరేసి, చీకటి జీఓలు వద్దేవద్దని చెప్పి నిరసన తెలిపారు.ఇప్పుడు పేర్ని నాని తనదైన శైలిలో మంత్రుల కమిటీ అన్నది తనకు తెలియనే తెలియదని అన్నారు.ఉద్యోగులతో మాట్లాడేందుకు ఫైవ్ మెన్ కమిటీ ఒకటి వేశారని ఓ వైపు వార్తలు వస్తుంటే పేర్ని నాని మాత్రం అలాంటివేవీ లేవని తేల్చేశారు.దీంతో ఉద్యోగ వర్గాలు మళ్లీ అయోమయంలో పడిపోయాయి.
సమ్మెకు సంబంధించిన విషయాలు కూడా తనకు తెలియవు అని చెప్పారు పేర్ని నాని.అంటే ఇంత జరుగుతున్నా ఉద్యోగుల ఆందోళనకూ క్యాబినెట్ కు మధ్య ఉన్న అంతరం అలానే ఉందని తేలిపోయింది.అవును ఇవాళ కొత్త పీఆర్సీకి క్యాబినెట్ ఓకే చేసింది కనుక ఇకపై జగన్ నిర్ణయాల్లో ఎటువంటి మార్పులూ ఉండవని కూడా స్పష్టం అయిపోయింది.ఈ దశలో ఉద్యోగులు రోడ్డెక్కినా., ఫ్యాన్ కింద కూర్చొని ఆఫీసులో ఉద్యోగం చేసినా జగన్ తీసుకున్న నిర్ణయాల ఫలితం మాత్రం ఏ విధంగానూ మారదు అన్నది కూడా క్లారిఫై అయిపోయింది.ఇంకేం సమ్మె చేయకుండా ఉద్యోగులు మధ్యే మార్గంగా పేర్ని నానితో చర్చలకు వెళ్లొచ్చుగా! కాస్తయినా కొన్నయినా నిర్ణయాలు మారవచ్చునేమో!