మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు కూడా నియోజకవర్గ పరిధిలోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొంటున్నారు.
మరోవైపు ఉప ఎన్నిక నేపథ్యంలో నగదు, ఇతరత్రా వస్తువుల తరలింపుపై పోలీసులు నిఘా ఉంచారు. నియోజకవర్గంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేస్తూ సోదాలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని మరి విచారిస్తున్నారు.
ఉపఎన్నికలో భాగంగా పోలీసులు ఇవాళ కూడా వాహనతనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో చల్మెడలో వాహన సోదాలు చేశారు. ఈ సోదాల్లో పోలీసులు కోటి రూపాయలు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంలో రూ. కోటిని తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నగదుపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.