తెలంగాణలో పొలిటికల్ హీట్ … అసలు ఏం జరుగుతోంది?

తెలంగాణలో ఉన్నట్టుండి ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడం, దానిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించడం, పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటల స్పందించడం గంటల వ్యవధిలో జరిగిపోయాయి. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

అసలి ఏం జరిగింది అంటే… మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలోని కొందరు రైతుల భూములను మంత్రి ఈటల తమ కబ్జా చేసారని బాధితులు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అయితే ఫిర్యాదు అందిన కొద్ది సమయంలోనే సీఎం కేసీఆర్ దీనిపై స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే సీఎం కేసీఆర్‌కు, మంత్రి ఈటలకు కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వస్తుంది. పలుమార్లు మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలు కూడా ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. ఇటీవల హుజూరాబాద్‌లో మాట్లాడిన ఆయన తాను మళ్లీ మంత్రి హోదాలో రాకపోవచ్చని అన్నారు. అలానే టీఆర్ఎస్ పార్టీకి ఎవరూ ఓనర్లు కాదని, మంత్రి పదవి భిక్ష కాదని కూడా గతంలో ఈటల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

అయితే 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈటల కీలకంగా వ్యహరిస్తున్నారు. ఉద్యమ సమయంలో కూడా ఈటల సీఎం కేసీఆర్‌కు చాలా సన్నిహితుడు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ టీఆర్ఎస్ లో ఉన్న నేతలు ప్రస్తుతం అతికొద్ది మందే ఉన్నారు. అయితే ఈటల ప్రాధాన్యం తగ్గించేందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్ తరువాత ఆయన కొడుకు కేటీఆర్ , అల్లుడు హరీష్ రావుతో పాటు ఈటల ఈ ముగ్గురు నాయకులే టీఆర్ఎస్ పార్టీలో అత్యంత ముఖ్యనేతలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈటలను తప్పించేదుకే ఇలాంటి కుట్ర జరుగుతోందనే వాదనలు కొంతమంది నుంచి వినిపిస్తున్నాయి.

మంత్రి ఈటల కూడా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఎక్కడైనా తప్పు చేసినట్టు తేలితే శిక్షకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు.

కాగా తెలంగాణలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు ఎలాంటి ఎన్నికలు లేవు.  సరిగ్గా ఈ సమయంలోనే మంత్రి ఈటలపై ఆరోపణలు రావడం కూడా చర్చకు దారితీస్తుంది. గతంలో దుబ్బాక ఉపఎన్నిక , జీహెచ్ఎంసీ, పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్, పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో పార్టీపై ఎలాంటి ప్రభావం పడకుండా ఈ విషయాన్ని బయటకు తీయలేదనే వాదనలు ఉన్నాయి.