ఓటుకునోటు కేసుపై మ‌ళ్లీ రాజుకుంటున్న రాజ‌కీయాలు.. భ‌గ్గుమంటున్న వైసీపీ!

చాలా ఏళ్ల త‌ర్వాత ఓటుకు నోటు కేసు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. నిన్న ఎంపీ రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జిషీటు దాఖ‌లు చేయ‌డంతో ఒక్క‌సారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప్రకంప‌న‌లు చెల‌రేగాయి. అయితే ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నారా చంద్ర‌బాబునాయుడుపై చార్జీషీటు దాఖ‌లు చేయ‌క‌పోవ‌డంతో ఇప్పుడు వైసీపీ భ‌గ్గుమంటోంది.

ఈ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుపై ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రశ్నించారు. ఇలాంటి త‌ప్పులు చేసిన వారిపై చార్జిషీటు దాఖ‌లు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం పోతోంద‌న్నారు.

ఓటుకు నోటు కేసులో కర్త, కర్మ, క్రియ అన్ని చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే ర‌మేశ్ మాట‌ల వైసీపీ పెద్ద‌ల ప్లాన్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే అధిష్టానం మాట్లాడ‌కుండా సెకండ్ గ్రేడ్ నేత‌ల‌తో మాట్లాడిస్తున్నారు. ఈ కేసులో చంద్ర‌బాబు పాత్ర‌ను ఈడీ ప్ర‌స్తావించిన‌ప్పుడు ఎందుకు చార్జిషీటు దాఖ‌లు చేయ‌ట్లేద‌నేదే ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. ఏదేమైనా ఇప్పుడు వైసీపీకి మ‌రో ప‌ట్టు దొరికింద‌నే చెప్పాలి.