పొంగులేటికి రివర్స్ షాక్..సొంతగూటికి తెల్లం.!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రివర్స్ షాక్ తగిలింది. ఆయనతో పాటు బి‌ఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి వచ్చిన డాక్టర్ తెల్లం వెంకట్రావు..మళ్ళీ బి‌ఆర్‌ఎస్ గూటికే చేరుతున్నట్లు తెలిసింది. ఆయన భద్రాచలం సీటు ఆశిస్తున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే  పొదెం వీరయ్య ఉన్నారు. ఆయన్ని కాదని భద్రాచలం సీటు తెల్లంకు దక్కే ఛాన్స్ లేదు. దీంతో మళ్ళీ ఆయన బి‌ఆర్‌ఎస్ గూటికి చేరాలని చూస్తున్నట్లు తెలిసింది.

అయితే 2014 ఎన్నికల్లో పొంగులేటితో పాటు తెల్లం వైసీపీలో పనిచేశారు. పొంగులేటి ఖమ్మం ఎంపీగా గెలిస్తే..తెల్లం మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పొంగులేటితో కలిసి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇక 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి భద్రాచలంలో పోటీ చేసి..ఇదే పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కూడా భద్రాచలం బి‌ఆర్‌ఎస్ ఇంచార్జ్ గా పనిచేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే పొంగులేటి బి‌ఆర్‌ఎస్ పార్టీకి దూరమయ్యారో..అప్పటినుంచి తెల్లం కూడా బి‌ఆర్‌ఎస్‌కు దూరం జరిగారు.

Dr. Venkatarao

ఇక ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటితో పాటు తెల్లం కూడా కాంగ్రెస్ లో చేరారు.అయితే భద్రాచలం సీటు వస్తుందనే తాను కాంగ్రెస్ లో చేరానని ఆయన అంటున్నారు. వైద్యవృత్తిలో ఉన్న తాను పదిహేనేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, తనకు బీఆర్‌ఎస్‌ భద్రాచలం అభ్యర్థిగా టికెట్టు వస్తుందని తెలిసి కూడా తమ నాయకుడు పొంగులేటిని నమ్మి ఆయన వెంట నడిచానని,  అలాంటి తనకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే భద్రాచలం సీటు వీరయ్యకే ఫిక్స్. దీంతో తెల్లం..మళ్ళీ బి‌ఆర్‌ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. దీని ద్వారా పొంగులేటికి షాక్ ఇవ్వవచ్చు అనేది బి‌ఆర్‌ఎస్ ప్లాన్.

Read more RELATED
Recommended to you

Latest news