ప్రశాంత్ రెడ్డికి సొంత చిక్కులు..హ్యాట్రిక్‌ ఆగదా?

-

తెలంగాణ మంత్రుల్లో దూకుడుగా పనిచేసేవారిలో వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఒకరు. తెలంగాణ కేబినెట్ లో కీలకమంత్రి. ఇక ఇలా దూకుడుగా ఉండే ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా కూడా బలమైన నేత. తన సొంత నియోజకవర్గం బాల్కొండలో తిరుగులేని పొజిషన్ లో ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో 30 వేల ఓట్ల పైనే గెలిచారు. కే‌సి‌ఆర్ కేబినెట్ లో ఛాన్స్ దక్కించుకున్నారు. రాజకీయంగా ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలో ప్రశాంత్ ముందుంటారు.

ఇక ఈయన వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఈయనకు ప్రతిపక్షాల కంటే సొంత బంధువులతోనే చిక్కులు వచ్చి పడ్డాయి. మొన్నటివరకు తన సొంత సోదరి రాధిక రెడ్డి కాంగ్రెస్ నుంచి బాల్కొండ తరుపున పోటీ చేయాలని చూశారు. కానీ కుటుంబంలో పెద్దలు మాట్లాడటంతో రాధిక కాంగ్రెస్ నుంచి ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరే ఏదొక విధంగా కుటుంబ పోరు తప్పిందనుకునే లోపు..ప్రశాంత్ రెడ్డి మేనత్త రంగంలోకి దిగారు.

 

ఏలేటి అన్నపూర్ణమ్మ బి‌జే‌పిలో కీలక నాయకురాలుగా ఉన్నారు. ఆమె తనయుడు మల్లిఖార్జున్ రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో అన్నపూర్ణమ్మ బి‌జే‌పి నుంచి బాల్కొండ బరిలో ఉంటారని తెలుస్తోంది. అదే జరిగితే మేనత్తతో ప్రశాంత్‌కు కాస్త రిస్క్. గతంలో అన్నపూర్ణమ్మ  టి‌డి‌పి నుంచి ఆర్మూర్ బరిలో రెండుసార్లు గెలిచారు.

అప్పుడు ప్రశాంత్ తండ్రి సురేందర్ రెడ్డిని అన్నపూర్ణమ్మ ఓడించింది. తన సొంత అన్నని ఓడించిన అన్నపూర్ణమ్మ..ఇప్పుడు మేనల్లుడు ప్రశాంత్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇలా ప్రశాంత్ రెడ్డికి సొంత ఇంటి పోరు ఇబ్బంది పెడుతుంది. అయితే సర్వేలు చూసుకుంటే బాల్కొండలో ప్రశాంత్ రెడ్డికి తిరుగులేదని తెలుస్తోంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news