ఏపీ డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే లేఖ
అమరావతి (గుంటూరు): తెలుగుదేశం ప్రభుత్వంపై, చంద్రబాబునాయుడు, లోకేష్‌లపై పలు సందర్భాల్లో కోర్టులకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయని, భద్రత పెంచాలని ఏపీ డీజీపీకి మంగళవారం లేఖ రాశారు. వరుసగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో తనకు భద్రతను పెంచాలని కోరుతూ లేఖను స్వయంగా తీసుకెళ్లి డీజీపీకి ఆర్కే అందజేశారు. అనేకమంది తనను టార్గెట్ చేశారని ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకు తనకు గతంలోనే బెదిరింపు లేఖలు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
రాజధాని భూసమీకరణ, ఓటుకు కోట్లు కేసు, ముఖ్యమంత్రి అక్రమ నివాసం, సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై తాను న్యాయపోరాటాలు చేస్తున్న నేపథ్యంలో తనకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయని ఆయన లేఖలో తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎమ్మెల్యే ఆర్కేకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్ సెక్యూరిటీ అందజేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అంశాల మీద ఎమ్మెల్యే ఆర్కే న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియా నుంచి బెదిరింపులు లేఖలు, హతమారుస్తామంటూ ఫోన్‌కాల్స్ ఆయనకు వచ్చాయి. మావోయిస్టుల పేరిట కూడా ఇటీవల బెదిరింపుల లేఖలు వస్తున్న నేపథ్యంలో తన భద్రతను పెంచి.. కనీసం టూ ప్లస్ 2 (2+2) గన్‌మెన్ సెక్యూరిటీ అందజేయాలని ఆయన లేఖలో కోరారు.