రాజకీయం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందని అనుకోలేం. ఓడలు బళ్లవడం, బళ్లు ఓడలవడం పాలిటిక్స్లో మామూలే. ఒకప్పుడు తిరుగేలేదని అనుకున్న నాయకులు కూడా పరిస్థితుల ప్రబావంతో రాజకీయాల్లో సతమతమైన పరిస్థితి తెలిసిందే. ఇప్పుడు ఇదే పరిస్థితి బీజేపీ కీలక నాయకురాలు.. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఏర్పడింది. వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన పురందేశ్వరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే విశాఖ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అనంతరం.. ఆమె కేంద్రం కేబినెట్‌లోనూ బెర్త్ దక్కించుకున్నారు.
అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఎదురైన ఎదురీత నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె అప్పట్లో వైసీపీ ఆఫర్ ఇచ్చినా తిరస్కరించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కడప జిల్లా రాజంపేట నుంచి 2014లో పోటీ చేయాల్సిన పరిస్తితి వచ్చింది. అయితే, ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ.. పార్టీలో ఏదైనా పదవి లభిస్తుందనే ఆశతో ఉన్న పురందేశ్వరి.. అక్క డే కొనసాగారు. ఇక, ఇటీవల ఎన్నికల్లో మరోసారి బీజేపీ జెండాపై విశాఖ నుంచి పోటీ చేశారు. అయి నప్ప టికీ.. ఆమె విజయానికి దూరమయ్యారు. దీంతో రెండు సార్లు వరుస ఓటములతో కొంత మేరకు డ్యామేజీ ఏర్ప డిందనడంలో ఎలాంటి సందేహంలేదు.
అయితే, ఇన్నేళ్లుగా పార్టీలోనే ఉన్నా.. వాయిస్ వినిపిస్తున్నా.. పార్టీ అధినాయకులు వచ్చినప్పుడు ట్రాన్స్‌లేటర్ డ్యూటీ చేస్తున్నా కూడా ఆమెకు ఆశించిన మేరకు ఎక్కడా గుర్తింపు రాలేదనేది వాస్తవం. బీజేపీలో ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒంటరిపోరు చేస్తున్నారని అనడంలో సందేహం లేదు. అయిన ప్పటికీ.. జాతీయ రాజకీయాలపై ఉన్న ఆసక్తి నేపథ్యంలో పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగుతున్నారని అంటున్నారు పరిశీలకులు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది. ఇప్పటికే పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎలాగై వైసీపీలో ఉన్నందున పురందేశ్వరి కూడావచ్చి పార్టీలో చేరాలని వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
పురందేశ్వరి వస్తే.. పార్టీలో కీలకమైన పదవిని ఇస్తామని, రాజ్యసభకు పంపుతామని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటి వరకు కూడా పురందేశ్వరి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ పరిణామాలను గమనిస్తున్న పురందేశ్వరి అనుచరులు, ఆమె అభిమానులు వైసీపీలోకి ఎంటర్ అవడమే బెటరని అంటున్నారు. రాజ్యసభ టికెట్తో పాటు పార్టీలోనూ గట్టి వాయిస్ వినిపించే స్థాయి ఏర్పడుతుందని, మళ్లీ పూర్వవైభవం వస్తుందని అంటున్నారు. కానీ, ఇప్పటి వరకు ఎక్కడా పురందేశ్వరి నుంచి ఎలాంటి సిగ్నల్ వెలువడలేదు. దీంతో ఆమె ఏం ఆలోచిస్తున్నారనే విషయం సస్పెన్స్‌గా మారింది.