రఘువీరా రీఎంట్రీ….కళ్యాణదుర్గం నియోజకవర్గంపై ఫోకస్‌

-

ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వున్నారా అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతల్లో ఆయన కూడా ఒకరు. రఘువీరా సీఎం కూడా అవుతారనే చాలామంది భావించారు.అనూహ్యంగా ఏపీ విభజన జరగడం ఆ తరువాత ఆయన కనుమరుగు కావడం జరిగిపోయాయి.అనంతరపురం జిల్లాకు చెందిన రఘువీరాకు ఇప్పటికీ రాజకీయంగా ఒక మంచి పేరుంది. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లలో

పనిచేసిన రఘువీరా రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి పీసీసీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. కాంగ్రెస్‌కు ఏపీలో ఆదరణ తగ్గడంతో సొంత ఊరికే పరిమితమై ఇన్నాళ్ళూ వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలక్షేపం చేశారు.

మొన్నామధ్య కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించారు. తాను రాజకీయాలకు దూరం కాలేదని ఈ ప్రచారాల ద్వారా ఓ సంకేతం పంపారు.అంతకుముందు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తళుక్కున మెరిశారు. బెంగళూరు నగర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వర్తించి అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు.దీంతో ఆయనకు కేంద్ర కమిటీలో సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఛాన్స్ కొట్టేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.పదేళ్ళ తరువాత ఇక్కడ అధికారాన్ని దక్కించుకుంది ఆ పార్టీ. ఇదే ఊపులో ఏపీ పైనా ఫోకస్‌ పెట్టారు కాంగ్రెస్‌ హైకమాండ్‌ నేతలు.ఏపీలో పోగొట్టుకున్న అలనాటి వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు రాహుల్‌ సేన పావులు కదుపుతోంది.దీంతో రఘువీరా సైతం మళ్ళీ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం నుంచి తొలుత ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆ తరువాత కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మారి అక్కడ నుంచి కూడా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి 30 వేల ఓట్లు సాధించారు.ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కళ్యాణ దుర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు అనుచరుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ తరపున గెలిచిన ఉషశ్రీ చరణ్ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ సారి ఆమెకు పెనుకొండ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్‌.వైసీపీ తరపున ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అటు టీడీపీలోనూ టిక్కెట్‌ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు వున్నాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు.ఆయనకు వివాద రహితుడిగా పేరు ఉండటమే కాదు మంత్రిగా వున్న సమయంలో చేసిన అభివృద్ధి కూడా కలిసిరానుంది.ఒకవేళ టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకుంటే కళ్యాణదుర్గం సీటును సొంతం చేసుకునేందుకు రాహుల్‌తో రఘువీరా టచ్‌లో ఉన్నట్లు ఉన్నారని సమాచారం. మరో నెల రోజులు గడిస్తే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news