ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టా ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జనాల్లోకి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఆయన ప్రత్యేక షెడ్యూల్‌ను తయారు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంక్రాంతి పండగ ముగిసిన తరువాత ఎన్నికల ప్రచారానికి సీఎం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు ఆయన జనాల్లోనే ఉండేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ అధినేత మళ్ళీ గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు. ఓ వైపు అభ్యర్ధులను ఖరారు చేస్తూనే మరోవైపు రాష్ర్ట పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రానున్న మార్చి నెలలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఈ లోపు అనగా జనవరి 21 నుంచి ఏపీ పర్యటనలో బీజీ అయ్యేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రీజినల్ కోఆర్డినేటర్‌లు సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను,ద్వితీయ శ్రేణి నేతలను సీఎం పర్యటనకు సమాయత్తం చేస్తున్నారు. పర్యటనకు వెళ్ళేలోగా రాష్ర్టవ్యాప్తంగా అభ్యర్ధుల లిస్టును ఖరారు చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు సీఎం జగన్. కొత్త అభ్యర్ధులను ప్రజలకు తానే స్వయంగా పరిచయం చేసి వారిని గెలిపించాలని కోరేందుకు ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.పర్యటన ఎక్కడి నుంచి మొదలు పెట్టి ఎక్కడ పూర్తి చేయాలని అనే అంశంపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. మరో పక్షం రోజుల్లో సీఎం పర్యటనపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు పార్టీ పెద్దలు.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ర్టమంతా చుట్టేశారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.2019లో ఏపీలో అధికారంలోకి రావడానికి ఈ యాత్ర వైసీపీకి సూపర్ మైలేజీ ఇచ్చింది.ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్‌రెడ్డి నేరుగా ప్రజలతో కలిసి మాట్లాడింది లేదు.ఏదైనా సంక్షేమం పథకం పేరుతో నిధుల విడుదల సమయంలో ఆయా జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా ఒకరిద్దరితో మాట్లాడటమే తప్ప ప్రజలతో ఎక్కువ సమయం గడిపిన దాఖలాలు లేవు.ప్రజలతో కలిసి వారి సమస్యలపై నేరుగా ప్రజలతో చర్చిస్తే పార్టీకి మైలేజీ పెరిగే అవకాశం ఉంది.ఈ లక్ష్యంతోనే సీఎం జగన్ జనాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిథులు సరిగా ప్రజలతో మమేకం కాకపోవడంతో పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేతలే ప్రజల్లోకి రావడం లేదు,,,ఇక ముఖ్యమంత్రి ఏ మేరకు జనాల్లోకి వస్తారనే అపవాదు కూడా సీఎంపై ఉంది.అటు ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని నొక్కి పలుకుతూ కేవలం బటన్ నొక్కడానికే సీఎం పనికొప్తారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు.
ఈ అపవాదులను తొలగించడం కోసమే సీఎం జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.కొత్త వారిని ఇన్‌చార్జులుగా ప్రకటించిన నియోజకవర్గాల్లోనే ముందుగా సీఎం పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.జనవరి 21 నుంచి నిత్యం జనాల్లో ఉండేలా టూర్ ప్లాన్ చేస్తున్నారు.ఈ పర్యటనలో సామాన్య ప్రజలకు సమయం ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తలను కలిసి వారి కష్టనష్టాలను తెలుసుకుని వారికి భరోసా ఇచ్చేందుకు సీఎం సమాయత్తమవుతున్నారు. వీలైతే సమస్యలను అక్కడే పరిష్కరించడం లేదంటే ప్రత్యామ్నాయం చూపాలనే లక్ష్యంతో సీఎం జనాల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఐదేళ్ల తరువాత సీఎం స్వయంగా జానాల్లోకి వచ్చేందుకు సిద్ధం కావడంతో అటు ప్రజలు కూడా ఆశగా ఎదురుచూప్తున్నారు.