గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఓవైపు బీజేపీ, మరోవైపు ఆప్, ఇంకోవైపు కాంగ్రెస్ లు ప్రచారంలో జోష్ పెంచాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 21న ఆయన రాజ్‌కోట్‌తో పాటు సూరత్ జిల్లాలోని మహువాలో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారని పార్టీ నేత ఒకరు వెల్లడించారు. రెండున్నర నెలల తర్వాత రాహుల్ మళ్లీ గుజరాత్‌లో అడుగు పెట్టబోతున్నారు. భారత్ జోడో యాత్రకు రెండ్రోజుల ముందు సెప్టెంబర్ 5న చివరిసారిగా ఆయన గుజరాత్‌లో పర్యటించారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నిమగ్నమై ఉన్నారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న యాత్ర 20న మధ్యప్రదేశ్‌లో అడుగుపెడుతోంది. ఇటీవల ఎన్నికలు జరిగిన హిమాచల్ ప్రదేశ్‌లో ఆయన పర్యటించలేదు. గుజరాత్ ఎన్నికల ప్రచారానికీ దూరంగా ఉంటారని ప్రచారం జరిగింది. ఆ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాహుల్ పేరు ఉన్నా.. ఆయన పర్యటనపై మాత్రం స్పష్టత రాలేదు. ఓటమి భయంతోనే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారంటూ బీజేపీ టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటన ఖరారు కావడం గమనార్హం.