రేఖానాయ‌క్ vs జాన్స‌న్ నాయ‌క్..

-

నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం రేఖానాయ‌క్ వ‌ర్సెస్ జాన్స‌న్ నాయ‌క్ గా మారింది. మంత్రి కేటీఆర్ స‌న్నిహుతుడు జాన్స‌న్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వ‌డ‌మే అందుకు కార‌ణం. ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌డంపై సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయ‌క్ గుర్రుగా ఉన్నారు. ఇక్క‌డే అస‌లు క‌ధ మొద‌లైంది. కుల వివాదం తెర‌పైకి వ‌చ్చింది. రేఖానాయ‌క్ స్వ‌యంగా ఈ అంశాన్ని లేవ‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జాన్స‌న్ నాయ‌క్ లంబాడా తెగ‌కు చెందిన వ్య‌క్తి కాద‌ని, ఆయ‌న తాత ముత్తాత‌లు, త‌ల్లిదండ్రులు క్రైస్త‌వ మ‌తంలో కొన‌సాగుతున్నార‌ని ఆమె ఆరోపిస్తోంది. ఆయ‌న పేరులోనే క్రైస్త‌వ మ‌తం ఉందని, కుల ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఖానాపూర్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు కావడంతో ఎస్టీ అభ్య‌ర్ధికే టిక్కెట్ ఇవ్వాలి. అయితే జాన్స‌న్ నాయ‌క్ ఎస్టీ కాద‌ని, లంబాడా తెగ‌కి చెందిన వ్య‌క్తి కాద‌న్న‌ది రేఖానాయ‌క్ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఎస్టీ కాని వ్య‌క్తికి టిక్కెట్ ఇవ్వ‌డంతో నాటి నుంచి ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. దీంతో జాన్స‌న్ ను టార్గెట్ చేసుకుని వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు కూడా దిగుతోంది. ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్ళాల‌ని కూడా ఆమె భావిస్తోంది. జాన్సన్ నాయక్‌ను లక్ష్యంగా చేసుకుని ఆమె పోటీలో ఉండబోతున్నారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీ టిక్కెట్ ఇవ్వ‌క‌పోయినా ఆమె బ‌రిలోకి దిగాల‌ని, కుదిరితే స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగానైనా లేదా వేరే పార్టీ అభ్య‌ర్ధిగానైనా పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది.

రేఖానాయ‌ర్ చేస్తోన్న ఆరోప‌ణ‌లపై జాన్స‌న్ నాయ‌క్ నుంచి ఎలాంటి రియాక్ష‌న్ రాలేదు. అలాగే జాన్స‌న్ పై రేఖానాయ‌క్ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై బీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌నూ లేదు. అయితే పార్టీలో మాత్రం అంత‌ర్గ‌తంగా రేఖా చేసిన ఆరోప‌ణ‌ల‌తో క‌ల‌క‌లం మొద‌లైంది. ఈ అంశానికి పుల్ స్టాప్ పెట్టే యోచ‌న‌లో హైక‌మాండ్ ఉన్న‌ట్లు స‌మాచారం. మంత్రి కేటీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగి వివాదాస్ప‌ద‌మ‌వుతోన్న ఖానాపూర్ టిక్కెట్ అంశాన్ని ఓ కొలిక్కి తెస్తార‌ని పార్టీలోని పెద్ద‌లు బావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిత్వం పొందిన జాన్సన్ నాయక్ విషయంలో మాత్రం రేఖానాయక్ ఆరోపణలు చేస్తూ, ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతుండటం హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news