రేవంత్ కొత్త పార్టీ ఈటెల, విశ్వేశ్వర్ రెడ్డి కూడా..?

-

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ బిజెపి టిడిపి పార్టీలు అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందాయి .ప్రస్తుతం రాష్ట్రంలో దీటైన ప్రతిపక్ష పార్టీ అవసరం ఎంతగానో ఉంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిగా , ఒక శక్తిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఎదుర్కోవడంలో ముందున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ప్రతి అంశాన్ని ప్రజల ముందు పెట్టి తూర్పార పడుతున్న విషయం తెలిసిందే. ఇందుకుగాను ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి మద్దతు లభించడం, ముఖ్యంగా యూత్ నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఇదే టెంపోను రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డికి నాయకులంతా వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఆయన కూడా ఆ పార్టీలో విసిగి వేసారి పోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయడమే శ్రేయస్కరం అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే సమయంలో లో తెలంగాణ క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, భూకబ్జాలు ఆరోపణలతో పార్టీ నుంచి ఆయనను కెసిఆర్ గెంటేశారు. ఈటెల రాజేందర్ కు ఒక సరైన రాజకీయ వేదిక లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి నాయకత్వం లో ఏర్పడే కొత్త పార్టీకి మూలస్తంభంగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పడే ప్రాంతీయ పార్టీలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఆర్థిక బలం తో ముందుకు రావడానికి సిద్ధపడినట్లు సమాచారం. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర పరిణామాలను పరిశీలిస్తే మాత్రం కొత్త రాజకీయ పార్టీ త్వరలోనే తెలంగాణలో ఆవిర్భవించ నున్నట్లు అర్థమవుతుంది. ఇందుకుగాను రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇరువురు నేతలు కలిసి ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో తన అభిమానులు ప్రజలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి వారి అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుంటానని బయల్దేరి వెళ్లారు. అయితే ప్రధానంగా కొత్త పార్టీ పెడితే రేవంత్ రెడ్డి నాయకత్వం లోనే ఆ పార్టీ ప్రజల్లో రానిస్తుందనే అభిప్రాయం ఈటల రాజేందర్ కూడా వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకుగాను పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమవుతాయని దాని కోసం కూడా పెట్టుబడి పెట్టేందుకు చాలామంది వ్యాపారవేత్తలు తెరవెనుక సహాయ సహకారాలు అందజేస్తారని అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఆర్థికంగా కొత్త పార్టీకి పూర్తి అండదండలు ఉంటాయని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రేవంత్ రెడ్డి,ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలసి ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీకి టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి టిడిపి పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరుతారని కూడా అంచనా వేస్తున్నారు.2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కొత్త పార్టీ అనివార్యంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడే కొత్త రాజకీయ పార్టీ లోకి రావడానికి ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news