సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

-

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కి సచిన్‌ పైలెట్‌కి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగి ఇరువురు నేతలకు నచ్చజెప్పినా వారిలో ఎలాంటి మార్పులు రావడంలేదు. సచిన్‌ పైలెట్‌ నేతృత్వం వహించే శాఖలపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నిర్ణయాలు తీసుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పైలెట్‌. మరికొన్ని నెలల్లో రాష్ర్ట అసెబ్లీకి ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీలో అలాగే ప్రభుత్వంలో ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఇటీవల అశోక్‌ గెహ్లాట్‌తో ఘర్షణకు దిగిన పైలెట్‌ సొంత పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన అనుచురులు అంగీకరిస్తున్నారు.

మే నెలలో జైపూర్‌ శివార్లలో నిర్వహించిన యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన సచిన్‌- ప్రధానంగా మూడు డిమాండ్లను గెహ్లాట్‌ ముందుంచారు.వసుంధర రాజే హయాంలో అవినీతిపై చర్యలు, రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పునరుద్ధరణ, పరీక్షా పేపర్ల లీకేజీలో బాధితులైన యువతకు పరిహారం చెల్లింపు…… ఈ మూడింటికి సమాధానం కావాలని పట్టుబట్టారు.ఈ మూడింటి పరిష్కారానికి మే 31వరకు గడువు పెట్టారు. డిమాండ్లు తీర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సచిన్‌.అయినప్పటికీ ప్రభుత్వం నుంచి గానీ,పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో మరింతగా మనస్తాపానికి గురయ్యారు సచిన్‌ పైలెట్‌. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు.

మే 29న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీలతో అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలెట్‌ విడివిడిగా బేటీ అయ్యారు. భేటీ అనంతరం పైలెట్‌, గెహ్లాట్‌లను కలిపి ఒక ఫొటో తీయడానికి చాలా ప్రయత్నమే చేశారు ఖర్గే. అటు రాహుల్‌ గాంధీ ప్రయత్నించినా విఫలమే అయింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ రెండుగా చీలిపోయిందనేందుకు ఇదే నిదర్శనమని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తన నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన సచిన్‌-, గెహ్లాట్‌ ప్రభుత్వం ముందు తాను ఉంచిన మూడు డిమాండ్ల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. తన తండ్రి రాజేశ్‌ పైలెట్‌ వర్థంతి రోజైన జూన్‌ 11న సచిన్‌ పైలెట్‌ ఒక కీలకమైన ప్రకటన చేస్తారనే ఊహగానాలు రాజస్థాన్‌ రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. ఆ సందర్భంగా నిర్వహించే సభలో కొత్త పార్టీకి సంబంధించిన ప్రణాళికలను సచిన్‌ పైలెట్‌ ప్రకటిస్తారని తెలిసింది. కొత్త పార్టీకి ‘ప్రగతిశీల్‌ కాంగ్రెస్‌’ అనే పేరుపెట్టినట్టు సమాచారం.

ఇక కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీతో ప్రజల్లోకి వెళ్ళాలనుకునే సచిన్‌ పైలెట్‌కి ప్రతి అడుగులోనూ ఐ-ప్యాక్‌ వ్యూహం ఉన్నట్లు సమాచారం. ఈ యావత్‌ ప్రక్రియలో ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారని తెలిసింది.ఏప్రిల్‌ 11న పైలెట్‌ చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు ఐ-ప్యాక్‌ వలంటీర్లు సాయపడినట్టు తెలిసింది. వసుంధర రాజే సీఎంగా ఉండగా రాష్ట్రం లో చోటు చేసుకున్న అవినీతిపై గెహ్లాట్‌ సర్కారు చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సచిన్‌ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగ నియామక పరీక్షలకు చెందిన పేపర్ల లీకేజ్‌పై చర్య కోసం ఒత్తిడి చేస్తూ అజ్మీర్‌ నుంచి జైపూర్‌ వరకు ఆయన ఐదురోజుల పాటు చేపట్టిన పాదయాత్రకు పథక రచన చేసింది
కూడా ఐ-ప్యాక్‌ వ్యూహకర్తలేనని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news