దివంగత వైఎస్సార్ సన్నిహితుడు, స్నేహితుడు ఎవరంటే ఠక్కున కేవీపీ రామచంద్రరావు పేరు చెప్పేయొచ్చు. వైఎస్సార్‌కు కేవీపీ అంటే ఎనలేని ప్రేమ. అసలు వైఎస్సార్‌కు ఆత్మ కేవీపీ అనేవారు. అయితే అప్పుడు వైఎస్సార్‌కు ఆత్మలాగా కేవీపీ ఉంటే…ఇప్పుడు జగన్‌కు సజ్జల రామకృష్ణారెడ్డి అండగా ఉంటున్నారని ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.
పార్టీ పరంగా జగన్ తర్వాత విజయసాయిరెడ్డి ఉన్నా సరే, ఆయన కేవలం ఉత్తరాంధ్ర రాజకీయాలకే పరిమితం అయ్యారు. కానీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి…జగన్ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్నారని ప్రచారం నడుస్తోంది. జగన్ తర్వాత సజ్జలనే ప్రభుత్వంలో కీలకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయనే మంత్రుల అందరికీ హెడ్‌లాగా ముందుకెళుతున్నారని అంటున్నారు.
అలాగే ప్రతి శాఖలో సజ్జల ప్రమేయం ఉంటుందని, ముఖ్యంగా హోమ్ శాఖ సజ్జల నడిపిస్తున్నారని ప్రతిపక్ష టిడిపి సైతం విమర్శిస్తుంది. అలాగే ఏ విషయంలోనైనా, ఏ కార్యక్రమంలోనైనా సజ్జలనే ప్రధానంగా ఉంటున్నారు. ఇక మంత్రులు కంటే ఎక్కువగా సజ్జల మీడియా సమావేశాలు పెడుతూ, ప్రతిపక్ష టిడిపికి కౌంటర్లు ఇస్తున్నారు. అంటే సిఎం జగన్ లోపలే ఉంటుంటే, సజ్జల బయట ఉంటూ అన్నీ పనులు చూసుకుంటున్నారని చెబుతున్నారు.
ఇలా ప్రభుత్వంలో కీలకంగా మారిన సజ్జలని జగన్ క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సజ్జలని మంత్రిగా తీసుకుంటే మరింతగా ప్లస్ అవుతుందని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఒక ప్రభుత్వ సలహాదారుడు అయ్యి ఉండి, రాజకీయాలు ఎలా చేస్తారని టిడిపి విమర్శిస్తుంది. అలాంటప్పుడు మంత్రి అయితే ఇలాంటి విమర్శలు ఉండవని, ఇంకా దూకుడుగా సజ్జల ఉండొచ్చని చెబుతున్నారు.
కానీ సజ్జలని క్యాబినెట్‌లోకి తీసుకోవడం కష్టం. ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇవ్వడం కష్టం. ఎందుకంటే మండలి రద్దు అంశం తెరపై ఉంది. అందుకే మోపిదేవి శ్రీనివాసరావు, పిల్లి సుభాష్‌లని సైతం రాజీనామాలు చేశారు. లేదంటే బద్వేలు ఉపఎన్నిక బరిలో దించి, సజ్జలని ఎమ్మెల్యే చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి సజ్జల, జగన్ క్యాబినెట్‌లోకి వస్తారనేది కేవలం ప్రచారమూ లేక నిజం అవుతుందో?