గతకొన్ని రోజులుగా చినబాబు నారా లోకేష్.. రాజకీయ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళగిరి నియోజకవర్గం ఇచ్చిన దెబ్బ, అనంతరం కరోనా కాటు తో ప్రత్యక్షరాజకీయాలకు పరోక్షంగా దూరమైపోయిన చినబాబు.. గతకొన్నిరోజులుగా జనాల్లోకి వస్తున్నారు. ముందుగా అమరావతి రైతుల గురించి హడావిడి చేసిన లోకేష్.. అనంతరం పోలవరం నిర్వాసితులపై స్పందించారు.. ఇక రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, మరణాలు సంభవించినా అక్కడ వాలిపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో లోకేష్ విషయంలో జగన్ సర్కార్ చేస్తున్న హడావిడిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ హత్యలు జరిగినా అక్కడ పరామర్శకు అని బయలుదేరుతున్న చినబాబు… అనంతరం మైకందుకుని జగన్ ను ఏకదాటిగా విమర్శిస్తున్నారు. కొన్నిసందర్భాల్లో విజ్ఞత కూడా మరిచి మరీ విమర్శిస్తున్నారనుకోండి.. అది వేరే విషయం! అయితే… ఈ విషయంలో జగన్ సర్కార్.. లోకేష్ ను పరోక్షంగా హీరోని చేసేస్తుంది!
లోకేష్ కు ఒక బలమైన మీడియా సపోర్ట్ ఉంది. దాంతో.. ఆయన పరామర్శలకు కావాల్సినంత కవరేజ్ దొరుకుతుంది. అది అక్కడితో అయిపోతుంది! కానీ… లోకేష్ పర్యటనలకు, పరామర్శలకు సర్కార్ అనుమతులు ఇవ్వకపోవడం వల్ల… మీడియాలో ఆ అంశమే హైలట్ అవుతుంది. లోకేష్ పరామర్శకంటే.. పోలీసుల అత్యుత్సాహమే మీడియాలో హైలైట్ అవుతుంది. ఫలితంగా చినబాబు హీరో అయిపోతున్నారు!!
అలాకాకుండా… చినబాబు లోకేష్ కి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసి, కోవిడ్ నిబంధనలు మాత్రం పాటించమని చెప్పేస్తే సరిపోతుంది. ఆయన వెళ్తారు.. బాదిత కుటుంబాన్ని పరామర్శిస్తారు.. కాసేపు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు.. అనంతరం ఇంటికెళ్లిపోతారు. అప్పుడు అది ఒక వార్తగా మిగిలిపోతుంది. కానీ… జగన్ సర్కార్ చేస్తున్న హడావిడి – పోలీసుల అత్యుత్సాహం వల్ల… లోకేష్ పర్యటనలు “హెడ్ లైన్స్” గా మారిపోతున్నాయి.
దీంతో… జగన్ పరోక్షంగా జాకీలేసి మరీ లోకేష్ ని పైకి లేపేస్తున్నట్లుగా మారిపోతుంది వ్యవహారం! ఫలితంగా… కొన్ని సందర్భాల్లో శత్రువులు కూడా పరోక్షంగా మేలు చేస్తుంటారు అనడానికి, లోకేష్ వ్యవహారంలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి ఉదాహరణగా మారిపోతుంది!