టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం పెద్దలను కలిసి తనను పీసీసీ చీఫ్‌గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. అనంతరం ఈ నెల 15వ తేదీన నిర్వహించే తన పదవీ బాధ్యతల స్వీకారానికి రావాలని వారిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర ముఖ్యనేతలను కలిసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గీల సమాచారం.
కాగా, టీపీసీసీ చీఫ్‌గా నియమితుడైన ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్‌ను మంగళవారం పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి అభినందించారు.వారిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విజయరమణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.అలాగే, 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఏఐసీసీతో జరిపే చర్చలకు మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరుకానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ సభ్యుల ఎంపిక లాంటి విషయాలపై ఏఐసీసీ అగ్ర నేతలు,రాష్ట్ర నేతలతో ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.