కాంగ్రెస్ గురువు… టీఆర్ఎస్ శిష్యుడు… ఒకే వేదిక‌పై బ‌ద్ధ‌శ‌త్రువులు

-

ఒక‌ప్పుడు వారిద్ద‌రూ గురుశిష్య‌లు.. కాల‌క్ర‌మంలో శిష్యుడు మ‌రోపార్టీలోకి వెళ్లి..ఏకంగా గురువునే ఓడించి, సంచ‌ల‌నం సృష్టించాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ గురువు శిష్యుడిని ఓడించి, త‌న స్థానాన్ని ప‌దిల‌ప‌ర్చుకున్నాడు. ఇక ఇదే స‌మ‌యంలో అనూహ్యంగా ఆ శిష్య‌డికి కొత్త‌గురువు మ‌రోవ‌రం ప్ర‌సాదించాడు. ఇలా ఒక‌ప్పుడు గురుశిష్యులు ఇప్పుడు బ‌ద్ధ‌శ‌త్రువులై ఒకే వేదిక‌ను పంచుకుంటే.. ప‌రిస్థ‌తి ఎలా ఉంటుందో.. ఎంత టెన్ష‌న్‌గా ఉంటుందో సుల‌భంగా అర్థం చేసుకోవ‌చ్చు.

sridhar babu and putta madhu are same stage singareni meeting manthani
sridhar babu and putta madhu are same stage singareni meeting manthani

ఇంత‌కీ.. ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..? వారు మ‌రెవ‌రో కాదు.. మంథ‌ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే, జెడ్పీచైర్మ‌న్ పుట్ట మ‌ధు. ఇప్పుడు వారిద్ద‌రు ఒకే వేదిక‌పై క‌నిపిస్తే..చాలు అంద‌రిలో ఒక‌టే టెన్ష‌న్‌. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో దుద్దిళ్ల శ్రీ‌పాద‌రావు త‌న‌యుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన శ్రీ‌ధ‌ర్‌బాబు చాలా జాగ్ర‌త్త‌గా త‌ర రాజ‌కీయ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. ఈ క్ర‌మంలో పుట్ట‌ మ‌ధు అత్యంత స‌న్నిహితుడిగా ఆయ‌నకు మారాడు.

చివ‌ర‌కు ఒకానొక ద‌శ‌లో పుట్ట మ‌ధు లేకుండా.. శ్రీ‌ధ‌ర్‌బాబు ఎక్క‌డికి కూడా వెళ్ల‌క‌పోయేవారు. ఇలా స‌వ్యంగా సాగుతున్న గురుశిష్య బంధంలో ఎక్క‌డో ఏదో తేడా వ‌చ్చింది. మ‌ధు కూడా ఎమ్మెల్యే అవ్వాల‌నుకున్నారు. 2009లో ప్ర‌జారాజ్యంలో చేరి గురువుపైనే పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మం జోరుగా ఉన్న‌ప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరి.. 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి, కాంగ్రెస్ నుంచిపోటీ చేసిన గురువు శ్రీ‌ధ‌ర్‌బాబును ఓడించి మ‌ధు సంచ‌ల‌నం సృష్టించారు.

ఇక అప్ప‌టి నుంచి రాజ‌కీయంగా వారిద్ద‌రూ బ‌ద్ధ‌శ‌త్రువుల‌య్యారు. అయితే.. 2019 ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి సీన్ రివ‌ర్స్ అయింది. ఈ ఎన్నిక‌ల్లో పుట్ట మ‌ధు గురువు శ్రీ‌ధ‌ర్‌బాబు చేతిలో ఓడిపోయారు. అయితే.. ఇక్క‌డ సీఎం కేసీఆర్ మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. పుట్ట మ‌ధుకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి.. ఏకంగా జెడ్పీచైర్మ‌న్‌ను చేశారు. దీంతో ఎమ్మెల్యేగా శ్రీ‌ధ‌ర్‌బాబు, జెడ్పీచైర్మ‌న్‌గా పుట్ట మ‌ధు ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల సింగరేణికి సంబంధించిన ఆర్జీ – 3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఆధ్వర్యంలో నిర్వ‌హించిన‌ హరితహారం కార్య‌క్ర‌మంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.

బ‌ద్ధ శ‌త్రువ‌లు అయిన ఈ మాజీ గురు శిష్యులు ఒకేవేదిక‌పై ఉండ‌డంతో అంద‌రూ టెన్ష‌న్ ప‌డ్డారు. శ్రీ‌ధ‌ర్‌బాబు మాట్లాడుతూ.. సింగ‌రేణి అధికారులు ప్రొటోకాల్ పాటించ‌లేద‌ని అన్నారు. దీనిపై మ‌ధు స్పందిస్తూ.. మున్సిపాలిటీ ప‌రిధిలో ప్రొటోకాల్ లేద‌ని చెప్ప‌డం.. ఒకానొక ద‌శ‌లో ఇరువ‌ర్గాల వారు నినాదాలు చేయ‌డంతో అంద‌రూ టెన్ష‌న్ ప‌డ్డారు. చివ‌ర‌కు అంతా స‌వ్యంగా సాగ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news