పరిస్థితులు అనూకూలంగా ఉంటే..ఎవరైనా ఇదే మాట అంటారు. ఇప్పుడు వైసీపీ లో ఉన్న 22 మంది ఎంపీలో ఒకరు.. ఇదే మాటను బహిరంగంగానే అనేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మనదే విజయం అని ఆయన తన అనుచరులకు పదే పదే చెబుతున్నారట. ఆయన ఎవరో కాదు..ఏలూరు ఎంపీ.. కోటగిరి శ్రీధర్. ఆయనకు ఇప్పుడున్న పరిస్థితిలో రాజకీయంగా పోటీ లేక పోవడం పెద్ద ప్లస్‌గా మారింది. ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని పరిశీలిస్తే.. ఇక్కడ టీడీపీ పుంజుకునే పరిస్థితిలోకనిపించడం లేదు.
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక, ఈ పార్టీ తరఫున ఇక్కడ గెలిచే నాయకుడు ఎవరూ లేక పోవడం వైసీపీకి సానుకూల పవనాలు వీచేలా చేస్తోంది. అదే సమయంలో ఎంపీగా శ్రీధర్.. అన్నివర్గాలకూ చేరువయ్యారు. ఆయన ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. రైతులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గాన్ని హరితం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇక, యువతకు ఉపాధి కల్పించేందుకు కూడా శ్రీధర్ ఎనలేని ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఢిల్లీలోనూ ఆయన పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు. తన పార్లమెంటు పరిధిలోని అందరు ఎమ్మెల్యేలతోనూ సఖ్యతతో ముందుకు వెళుతున్నారు. శ్రీధర్ సింగిల్ రూపాయి కూడా అవినీతి చేయరన్న పేరు సొంతం చేసుకున్నారు. ఇటు పార్టీలోను.. అందరినీ కలుపుకొని పోతున్నారు. ఎక్కడా వివాదాలు.. విభేదాలు రాకుండా.. చూసుకుంటున్నారు.
అదేసమయంలో పార్టీలో చేరేవారికి కూడా ప్రాధాన్యం ఇస్తానని ప్రకటిస్తున్నారు. దీంతో ఎంపీగా ఆయనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇక, టీడీపీలో ఈ తరహా వ్యూహంతో ముందుకు వచ్చే నాయకులు లేకపోవడంతో ఆయన వచ్చే ఎన్నికల్లోనూ తనదే గెలుపు ఖాయమని ప్రగాఢ విశ్వాసతంతో ఉండడం గమనార్హం.