అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో మోకాళ్ల బేరానికి వచ్చాడని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మెడవంచి మోకాళ్ల నమస్కారాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజలను జగన్ దగా చేశాడని మండిపడ్డారు. హోదా తేవడం తనకు చేతగాదని జగన్ రెడ్డి ప్రకటనే స్పష్టం చేసిందన్నారు. జగన్‌పై ఈడీ, సీఐడీ కేసుల కారణంగానే కేంద్రానికి లొంగిపోయారని విమర్శించారు. అన్నివిధాలా సరెండర్ అయ్యాడని, ప్రత్యేక హోదాపై నిస్సహాయంగా చేతులెత్తేశాడని ఆరోపించారు. కేంద్రంతో జగన్ రెడ్డి ములాఖత్ వల్ల యువతకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రాష్ట్రానికి తీరని చేటు వాటిల్లిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇప్పుడు ‘‘యువతకు తీరని మోసం’’గా మారిందన్నారు.
2020-21లో పారిశ్రామిక వృద్ది ఇప్పటికే మైనస్ 3.26%కాగా, ఆర్ధికాభివృద్దిలో దాని వాటాశాతం 20%దిగువకు పతనమైందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న యువతలో నిరుద్యోగరేటు ఇప్పటికే 13.5%కు పెరిగిపోయిందన్నారు. జగన్ లొంగుబాటు కారణంగా యువత భవిష్యత్తు అంధకారమైందని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించడంలో జగన్ వైఫల్యం వల్లే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ది ‘‘రివర్స్’’అయ్యిందని యనమల విమర్శించారు.