ఇప్పుడు నేటి రాజకీయాల్లో వ్యూహకర్తల జోరు ఎక్కువైంది. ఒకప్పుడు పార్టీ అధినేతలే వ్యూహాలు రచించి..తమ పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు రాజకీయ నేతలు కానీ వారిని వ్యూహకర్తలుగా పెట్టుకుని, వారు వేసే వ్యూహాలతో పార్టీలు ముందుకెళుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యూహకర్తల జోరు ఎక్కువైంది. అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్న సునీల్ కానుగోలు..ఇప్పుడు సైడ్ అవుతున్నారని తెలుస్తుంది.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహకర్తని నియమించుకునే పనిలో పడినట్లు సమాచారం. సునీల్…కర్నాటకలో కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అక్కడ అభ్యర్ధుల ఎంపిక,మేనిఫెస్టో తయారీ అంశంలో ముఖ్యపాత్ర వహించారు. అక్కడ కాంగ్రెస్ గెలవడానికి కృషి చేశారు.అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన సలహాదారుడుగా సునీల్‌ని నియమించుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పై సునీల్ ఫోకస్ పెట్టడం తగ్గింది. మొన్నటివరకు తెలంగాణ కాంగ్రెస్‌కు ఆయనే వ్యూహకర్తగా వ్యవహరించారు.
ఇప్పుడు కర్నాటక ప్రభుత్వంలో కీలకం కావడంతో తెలంగాణపై పెద్దగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు.ఈ నేపథ్యంలో శశికాంత్ సెంథిల్ కుమార్‌ని వ్యూహకర్తగా నియమించుకునేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. సునీల్ టీం లో కీలక సభ్యుడుగా ఉన్న శశికాంత్ సెంథిల్ కుమార్ కూడా.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వ్యూహకర్తగా పని చేశారు. ఇప్పుడు తెలంగాణలో పని చేయడానికి 40 మంది సభ్యులతో కూడిన ఓ టీమ్‌ను సెంథిల్ కుమార్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే సునీల్ లేకపోవడం తెలంగాణ కాంగ్రెస్ కు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఎన్నికలకు పెద్ద సమయం లేదు కాబట్టి.. ఈ కొన్ని నెలలు సునీల్ ఆధ్వర్యంలో శశికాంత్ వ్యూహాలతో కాంగ్రెస్ పనిచేయనుందని తెలుస్తుంది. మరి ఈ కొత్త వ్యూహకర్తతో తెలంగాణ లో కాంగ్రెస్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.