వివాదాస్పదమైన తాడిపత్రి రూర‌ల్ సిఐ తీరు

-

  • ఎమ్మెల్యే జేసీకి భారీ విందు
  • తాడిపత్రిలో పోస్టింగ్‌తో స్వామిభక్తి

అమ‌రావ‌తి(అనంతపురం): అనంత‌పురం జిల్లా పోలీసుల‌ను కొజ్జాల‌తో పోల్చిన జేసీ బ్ర‌ద‌ర్స్‌ను ఒక‌వైపు పోలీసు అధికారులు విమ‌ర్శిస్తుంటే, కొత్త‌గా తాడిప‌త్రి సిఐ పోస్టింగ్ వేయించుకున్న సిఐ మాత్రం ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డికి త‌న ఇంట్లో భారీ విందు ఇవ్వ‌డ‌మేగాక‌… ఇంటిదాకా ఊరేగింపుగా తీసుకెళ్ల‌డం వివాదాస్ప‌ద‌మైంది. తాడిపత్రిలో రూరల్‌ సీఐ నారాయణరెడ్డి పనితీరు తరచూ వివాదాస్పదమవుతోంది. ఎస్‌ఐలకు సీఐలుగా పదోన్నతులు ఇచ్చిన తరువాత మొట్టమొదటగా నారాయణరెడ్డి పేరే పరిశీలించారు. వాస్తవానికి ఎస్‌ఐగా పనిచేసిన చోటే సీఐగా తొలిపోస్టింగ్‌ ఇవ్వరు. అలాగే సీఐగా పదోన్నతి లభిస్తే రెండేళ్ల పాటు లూప్‌లైన్‌లో ఉంచాల్సి ఉంది. ఈ మేరకు కొన్ని రోజులు నారాయణరెడ్డిని పీటీసీకి పంపిన ఉన్నతాధికారులు.. ఆ వెంటనే ఆయన ఎస్‌ఐగా ఎక్కడ పనిచేశారో అదే స్టేషన్‌కు సీఐగా పోస్టింగ్‌ ఇవ్వడం చాలా విమర్శలకు తావిస్తోంది. దీనికి కారణం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సిఫార్సే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇందుకు కృతజ్ఞతగా నారాయణరెడ్డి తన సొంత గ్రామం వైఎస్సార్‌ జిల్లా కొండాపురం మండలం లావనూరులో భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. అనుచరగణంతో లావనూరుకు వెళ్లిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీఐ నారాయణరెడ్డి అనూహ్యరీతిలో స్వాగతం పలికారు. తన గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే జేసీపీఆర్‌ ఏది చెబితే దానికి తలూపి పాటించడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందన్నది సుస్పష్టం. మరి స్వామి భక్తి చాటుకుంటున్న సీఐ నారాయణరెడ్డి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news